స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలో విభేదాల స్వరం మళ్లీ బయటపడుతోంది. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. జనసేన కార్యకర్తలను కూలీలుగా చూడొద్దని చంద్రబాబును కోరిన ఆయన.. జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీనే పోటీ చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇటీవల ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన సమావేశంలోనూ బొలిశెట్టి ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలిచిన చోట జనసేన కార్యకర్తలను అణగదొక్కుతున్నారని, జనసేన గెలిచిన చోట మాత్రం టీడీపీ నేతలను తాము గౌరవిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
మరోవైపు జనసేన నేత చిక్కాల దొరబాబు కూడా కూటమిలో తమ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలను పోలీస్‌స్టేషన్లకు తరలిస్తే వారిని విడిపించలేని పరిస్థితి ఏర్పడిందని, అవసరం తీరిన తర్వాత టీడీపీ నేతలు జనసేనను తక్కువ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. సీఎం పదవినే టీడీపీకి త్యాగం చేశామని, జనసేనకు 100 శాతం సీట్లు ఇచ్చినా తప్పు లేదంటూ పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలనే డిమాండ్‌ను కూడా ఆయన ప్రస్తావించారు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన నేతలు వరుసగా సీట్ల పంపకం, కార్యకర్తల ప్రాధాన్యత, టీడీపీతో సంబంధాలపై బహిరంగంగా మాట్లాడటం కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. ఈ వ్యాఖ్యలు నేతల వ్యక్తిగత అసంతృప్తేనా? లేక జనసేనలోని అంతర్గత భావోద్వేగాలకు ప్రతిబింబమా? మరోవైపు, పవన్ కల్యాణ్ వ్యూహంలో భాగంగానే ఈ స్వరాలు బయటకు వస్తున్నాయా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.





