సంక్రాంతి (Sankranti) సీజన్‌కు తనదైన కామెడీ, ఎంటర్టైన్మెంట్తో సినిమాలు అందించే దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కలిసి నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోల ఫస్ట్ లుక్స్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఇప్పటివరకు వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు తాజాగా చిత్ర బృందం అధికారిక టైటిల్‌ను ప్రకటించింది. ‘వెంకీ అనిల్ 5’, ‘ఎన్కేఆర్ ఏఆర్ 2’ పేర్లతో వినిపించిన ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’(January 12 Release) అనే డిఫరెంట్ టైటిల్‌ను (Different Title) ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’(Bava Bammardi Soujanyamtho) అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ మధ్య బావా బామ్మర్దుల అనుబంధాన్ని ప్రధానంగా చూపిస్తూ సినిమా తెరకెక్కుతున్నట్లు టైటిల్, ట్యాగ్‌లైన్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి ఈ కాంబినేషన్ మరింత బలాన్ని చేకూర్చనుందని అభిమానులు భావిస్తున్నారు.
టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను కూడా చిత్ర బృందం చాలా ఫన్నీగా రూపొందించింది. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’ చిత్రంలోని క్లాసిక్ కామెడీ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను ప్రారంభించారు. అనంతరం వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్(Keerthy Suresh), కృతి శెట్టి(Krithi Shetty) కలిసి అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు.
అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ అని చెప్పడంతో హీరోలు అది సినిమా విడుదల తేదీ అనుకుంటారు. కానీ సినిమా పేరేంటని మళ్లీ ప్రశ్నించగా.. అదే సినిమా టైటిల్ అని అనిల్ రావిపూడి వెల్లడిస్తారు. ఈ సరదా సన్నివేశాలతో టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions), జీ స్టూడియోస్(Zee Studios), శ్రీమతి అర్చన (Smt. Archana) సమర్పణలో సినిమా తెరకెక్కుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంక్రాంతి సీజన్లో అనిల్ రావిపూడి సినిమాలకు ఉన్న క్రేజ్‌కు తోడు వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి క్రేజీ కాంబినేషన్ ఉండటంతో ఈ సినిమా మరింత ఆసక్తిని పెంచుతోంది. ‘జనవరి 12 విడుదల’ చిత్రం 2027 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.







