---Advertisement---

తమిళ చిత్రసీమలో విషాదం.. దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ కన్నుమూత

June 27, 2026

Summarize with AI

---Advertisement---

తమిళ సినీ పరిశ్రమలో (Tamil Film Industry) తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ (K. Bhagyaraj) (కృష్ణస్వామి భాగ్యరాజ్) శుక్రవారం రాత్రి గుండెపోటుతో (Heart Attack) కన్నుమూశారు(Passed Away). చెన్నైలోని (Chennai) నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి (Apollo Hospital) తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆయన మరణవార్తతో తమిళంతో పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే నిపుణుడిగా భాగ్యరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కు పైగా సినిమాల్లో నటించారు. సాధారణ కథలను ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయనకు ఉన్న ప్రతిభ కారణంగా “కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే”(King of Screenplay)గా సినీ ప్రపంచంలో గుర్తింపు పొందారు.

‘ముంధనై ముడిచ్చు’ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న భాగ్యరాజ్, సినీ రంగంతో పాటు సాహిత్యంపై కూడా ఆసక్తి చూపారు. ‘భాగ్య'(Bhagya) వారపత్రికకు సంపాదకుడిగా పనిచేయడంతో పాటు పలు నవలలు రచించారు. కుటుంబ కథా చిత్రాలను వినూత్నంగా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.

కేవలం 3 రోజుల క్రితమే గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన భాగ్యరాజ్ ఆకస్మిక మరణం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబంలో కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్ ఉన్నారు. ఇద్దరూ తమిళ సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా భాగ్యరాజ్ సుపరిచితుడే. అల్లరి నరేశ్ నటించిన ‘పెళ్లైంది కానీ’ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘అబ్బాయి గారు’ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఇటీవల విడుదలైన ‘కుబేర’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మరోసారి ప్రేక్షకులను మెప్పించారు.

భాగ్యరాజ్ మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఎన్నో చిరస్మరణీయ చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన భాగ్యరాజ్ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment