ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి (Khairatabad Assembly Constituency) ఉప ఎన్నిక (By-Election) నిర్వహణకు మార్గం సుగమమైంది. బీఆర్ఎస్(BRS) తరఫున ఎమ్మెల్యేగా(MLA) గెలిచిన దానం నాగేందర్ (Danam Nagender) అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
2024 ఏప్రిల్ 23న సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా (Congress Candidate) దానం నాగేందర్ నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచే ఆయన అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అదే తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం (Khairatabad Assembly Seat) ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉప ఎన్నికకు మార్గం ఏర్పడింది.
హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు అధికారికంగా గెజిట్ (Gazette) విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు గెజిట్లో పేర్కొన్నట్లు సమాచారం.
ఇక ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణపై తదుపరి చర్యలను ఎన్నికల సంఘం చేపట్టాల్సి ఉంది. ఖాళీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించనుంది. దీంతో హైదరాబాద్లో మరోసారి అసెంబ్లీ ఉప ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది.








