తెలంగాణలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మధ్య సంబంధాలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ప్రశ్నలు సంధించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) సోదాలు జరిగి రెండేళ్లు పూర్తయినా.. ఈ కేసు దర్యాప్తుపై ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన ఎందుకు లేదని ప్రశ్నించారు.
2024 సెప్టెంబర్ 27న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్(Hyderabad), ఖమ్మం (Khammam) సహా పలు ప్రాంతాల్లో సుమారు 16 చోట్ల తనిఖీలు జరిగినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ సోదాలు మనీలాండరింగ్ (Money Laundering) కేసు దర్యాప్తులో భాగంగా జరిగినట్లు అప్పట్లో పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈడీ దర్యాప్తుపై కేటీఆర్ ప్రశ్నలు
సోదాలు జరిగి రెండేళ్లు గడిచినా ఈడీ లేదా కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి దర్యాప్తు పురోగతిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. సోదాల్లో ఏం స్వాధీనం చేసుకున్నారు? దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉంది? అనే వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారంటూ బీజేపీపై కేటీఆర్ విమర్శలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు చెందిన మంత్రి విషయంలో మాత్రం ఈడీ, కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రికి ఈ విషయంలో ఎందుకు మినహాయింపు లభిస్తోందని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధాన్ని ప్రస్తావిస్తూ ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’(Ajab Prem Ki Ghazab Kahani) అంటూ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు.
Exactly two years since the Congress-BJP unholy nexus became official in Telangana
— KTR (@KTRBRS) September 27, 2026
The Enforcement Directorate conducted raids at 16 locations linked to Congress minister Pongulet Srinivas Reddy in connection with a money-laundering case on 27th Sept, 2024
Reports of several… pic.twitter.com/Ss2eIguoP6
బీఆర్ఎస్ ఘాటు విమర్శలు
ఇదే అంశంపై బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా కూడా స్పందించింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై జరిగిన ఈడీ సోదాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘చీకటి బంధం’ (Dark Nexus) ఉందంటూ ఆరోపణలు చేసింది.
ప్రతిపక్ష నేతలపై చర్యలు తీసుకునే ఈడీ.. కాంగ్రెస్ మంత్రి విషయంలో మాత్రం సోదాలు జరిగి రెండేళ్లు పూర్తయినా ఎలాంటి తదుపరి చర్యలు కనిపించడం లేదని బీఆర్ఎస్ విమర్శించింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న సంబంధానికి నిదర్శనంగా పేర్కొంది.
కాగా, 2024లో జరిగిన ఈడీ సోదాలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు హర్షారెడ్డికి సంబంధించిన ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగమని అప్పట్లో పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈడీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఆ కథనాలు వెల్లడించాయి.








