గణేష్ నిమజ్జన ఉత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్‌లో డీజే శబ్దాలపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
డీజే వాహనాలకు ఇబ్బందులు కల్పించవద్దని, ఏ ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయవద్దని మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, డీజీపీలకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. అదే ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు మాత్రం తన నియోజకవర్గంలో డీజేలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో ఒకే ప్రభుత్వ పరిధిలో డీజేల విషయంలో భిన్నమైన వైఖరులు ఎందుకు కనిపిస్తున్నాయనే చర్చ మొదలైంది.
ఉండి నియోజకవర్గ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజే సౌండ్స్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని కొందరు స్థానిక యువకులు రఘురామకృష్ణంరాజును కలిసి కోరారు. అయితే భారీ శబ్దాలతో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన అంగీకరించలేదు. డీజే శబ్దాల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను వివరించడంతో పాటు, ఇటీవల పత్రికల్లో వచ్చిన “డీజే సౌండ్స్‌కు ఆగిన గుండె” అనే వార్తా కథనాన్ని యువకులకు చూపించినట్లు తెలుస్తోంది.
భారీ శబ్దాలు, అధిక డెసిబెల్ స్థాయి వల్ల వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రఘురామ పేర్కొంటూ.. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు. డీజేలకు బదులుగా సంప్రదాయ మంగళ వాద్యాలు, భజనలు వంటి కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించాలని కోరారు. దీంతో డీజేలు లేకుండానే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థానిక యువకులు అంగీకరించినట్లు సమాచారం.
ఇదే సమయంలో డీజే శబ్దాలపై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తున్నాయి. విద్యార్థులు, సమాజంలో నైతిక విలువలను పెంపొందించే అంశాల్లో సలహాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. గణేష్ నిమజ్జనాల్లో డీజేల అధిక శబ్దాల వల్ల వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని, సంప్రదాయ మంగళ వాద్యాలు, భజనలతో నిమజ్జనాలు నిర్వహించడం మంచిదని ఆయన గతంలో సూచించారు.
అయితే డీజేలకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో డీజే వాహనాలకు ఇబ్బందులు కల్పించవద్దని లోకేష్ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం నియమించిన సలహాదారు డీజే శబ్దాల విషయంలో జాగ్రత్తలు సూచిస్తుండగా.. మరోవైపు మంత్రి లోకేష్ డీజే వాహనాలను సీజ్ చేయవద్దని కోరడం, ఇంకోవైపు రఘురామ తన నియోజకవర్గంలో డీజేలకు అనుమతి నిరాకరించడం వంటి పరిణామాలు భిన్న సందేశాలను ఇస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
మంత్రి నారా లోకేష్ రాష్ట్రస్థాయిలో చేసిన విజ్ఞప్తికి భిన్నంగా రఘురామ అనుమతి నిరాకరించడం.. ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయనే అంశాన్ని కూడా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకుల మధ్య ఒకే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే చర్చకు ఇది కారణమవుతోంది.
మొత్తంగా.. రాష్ట్రస్థాయిలో డీజేలకు సంబంధించి మంత్రి లోకేష్ చేసిన విజ్ఞప్తి ఒకవైపు ఉండగా, ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీసుకున్న నిర్ణయం మరోవైపు నిలిచింది. దీంతో డీజేల అంశం ఇప్పుడు కేవలం గణేష్ నిమజ్జనాల నిర్వహణకే పరిమితం కాకుండా.. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల భిన్న వైఖరులపై కూడా చర్చకు దారితీస్తోంది. ఇది పార్టీలో భవిష్యత్ నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్న లోకేష్ ఇమేజ్‌కు తీవ్రంగా నష్టం కలిగించే అంశంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





