మెగా డీఎస్సీ–2025(Mega DSC–2025) నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలు, అధికారుల తాజా వివరణలతో మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు(Sports Quota Certificates), టెట్ అర్హత(TET Eligibility), ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు(EWS Certificates), జూడో–కబడ్డీ(Judo–Kabaddi) సర్టిఫికెట్ల పరిశీలన వంటి అంశాలపై ప్రభుత్వం పలు చోట్ల పునఃపరిశీలన, విచారణకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డీఎస్సీలో (DSC) అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కర్నూలుకు చెందిన ప్రభాకర్ (Prabhakar) వ్యవహారంపై త్రిసభ్య కమిటీ (Three-Member Committee) ఏర్పాటు, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 372 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై విచారణ, జూడో సర్టిఫికెట్లపై విజిలెన్స్ పరిశీలన, ఇతర కేసుల్లో రీ-వెరిఫికేషన్ వంటి చర్యలు ఎందుకు అవసరమయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్టిఫికెట్ల విషయంలో ‘హ్యూమన్ ఎర్రర్’ (Human Error), ‘కన్ఫ్యూజన్’(Confusion), ‘ఫరధర్ ఎంక్వయిరీ’ (Further Inquiry) వంటి వివరణలు ఇస్తూనే మొత్తం నియామక ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని ప్రభుత్వం ఎలా చెబుతోందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసిన సర్టిఫికెట్లను ఆధారంగా చేసుకుని అర్హతలను పరిగణించామని అధికారులు చెప్పడం కూడా చర్చకు దారితీసింది. అసలు టోర్నమెంట్ జరిగిందా? సర్టిఫికెట్లు నిజమైనవేనా? సంతకాలు చెల్లుబాటు అవుతున్నాయా? అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాకు వాస్తవంగా అర్హులేనా? వంటి అంశాలను నియామకాలకు ముందే స్వతంత్రంగా ఎందుకు ధృవీకరించలేదనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
అదేవిధంగా టెట్ అర్హత(TET Eligibility), ఈడబ్ల్యూఎస్ స్థితి(EWS Status) వంటి కీలక అంశాలను నియామకాలకు ముందే పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా, ఉద్యోగాలు ఇచ్చిన అనంతరం విచారణలు చేపట్టడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం జరిగితే బాధ్యత కేవలం అభ్యర్థులపైనేనా? లేక సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై సమగ్ర, స్వతంత్ర ఆడిట్ నిర్వహించడంతోపాటు, సీబీఐ(CBI) వంటి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ బలపడుతోంది. ‘అవకతవకలు జరగలేద’ని చెప్పడం కంటే, ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అనుమానాలపై పూర్తి పారదర్శకతతో సమాధానాలు ఇవ్వాలని ప్రతిపక్షాలు, బాధిత అభ్యర్థులు కోరుతున్నారు.





