ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (Alliance Government) పాలన సగం కాలాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ.. ప్రభుత్వ పనితీరుపై (Government Performance) ప్రజల అభిప్రాయం (Public Opinion) ఎలా ఉందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఐఐటీయన్స్ గ్రూప్ (IITians Group) నిర్వహించినట్లు పేర్కొన్న ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వే (Mood of Andhra Survey) ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు 3 దశల్లో సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం 1,90,550 మంది నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొంది. రైతులు(Farmers), ఉద్యోగులు(Employees), నిరుద్యోగులు(Unemployed), వ్యాపారులు(Business People), మధ్యతరగతి కుటుంబాలు(Middle-Class Families), వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో పాటు 18 నుంచి 60 ఏళ్లు పైబడిన వయసు వర్గాల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు వెల్లడించింది.
కూటమి ప్రభుత్వ పాలనపై 4 శాతం మంది చాలా సంతృప్తిగా, 30 శాతం మంది సంతృప్తిగా ఉన్నామని చెప్పగా.. 45 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ పార్టీ బెస్ట్ అని ప్రశ్నించగా.. కూటమికి 40 శాతం, వైసీపీకి(YSRCP) 44.5 శాతం మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించింది.
శాంతిభద్రతల (Law and Order) విషయంలో 7 శాతం మంది చాలా సంతృప్తిగా, 30 శాతం మంది సాధారణంగా సంతృప్తిగా ఉన్నట్లు సర్వే తెలిపింది. డీఎస్సీ అక్రమాలు (DSC Irregularities) జరిగాయని 48 శాతం మంది అభిప్రాయపడగా.. 39 శాతం మంది ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని 42 శాతం మంది, లేదని 36 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని (Corruption of MLAs and Ministers) 27 శాతం మంది, రైతులు, కౌలుదారులకు గిట్టుబాటు ధరలు (Remunerative Prices) లేకపోవడాన్ని 25 శాతం, నిరుద్యోగాన్ని 21 శాతం, శాంతిభద్రతలను 15 శాతం, సంక్షేమ పథకాల అమలును 12 శాతం మంది పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. వైఎస్ జగన్‌కు (YS Jagan) 44 శాతం, చంద్రబాబు నాయుడికి (Chandrababu Naidu) 32 శాతం, పవన్ కల్యాణ్‌కు(Pawan Kalyan) 6 శాతం, లోకేశ్‌కు (Nara Lokesh) 5 శాతం మద్దతు లభించినట్లు సర్వే తెలిపింది. 2029లో కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని 39 శాతం మంది చెప్పగా.. 44 శాతం మంది రాదని అభిప్రాయపడ్డారు.
గత, ప్రస్తుత పాలనపై అభిప్రాయం కోరగా.. వైసీపీ పాలన (YSRCP Rule) బాగుందని 41 శాతం, కూటమి పాలన బాగుందని 38 శాతం మంది పేర్కొన్నారు. రెండు పాలనలు ఒకేలా ఉన్నాయని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి.. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీకి 45.5 శాతం, కూటమికి 44.5 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఈ ఓటు వాటా ఆధారంగా వైసీపీకి 83, కూటమికి 62 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మరో 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండొచ్చని తెలిపింది.
టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తే వైసీపీకి 47 శాతం, టీడీపీకి 36 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ పరిస్థితిలో వైసీపీకి 110-112, టీడీపీకి 43-45, జనసేనకు 2-4 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి సీట్లు దక్కకపోవచ్చని తెలిపింది.
ఇక వైసీపీ, టీడీపీ ఒంటరిగా.. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీకి 46.5 శాతం, టీడీపీకి 35 శాతం, జనసేన-బీజేపీ కూటమికి 10.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఈ మేరకు వైసీపీకి 95-96, టీడీపీకి 40-41, జనసేన-బీజేపీ కూటమికి 7-9 సీట్లు రావచ్చని పేర్కొంది.
ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన కూటమి ఎమ్మెల్యేలను 72 మంది రెడ్ జోన్(Red Zone), 30 మంది ఆరెంజ్ జోన్(Orange Zone), 73 మంది గ్రీన్ జోన్‌గా(Green Zone) విభజించినట్లు సర్వే తెలిపింది. కూటమి మంత్రుల్లో 10 మంది రెడ్ జోన్‌లో, 8 మంది ఆరెంజ్ జోన్‌లో, 7 మంది గ్రీన్ జోన్‌లో ఉన్నట్లు పేర్కొంది.
2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైసీపీ.. రెండేళ్లలోనే పలు సర్వేల్లో అధికారానికి చేరువగా కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ ఫలితాలు సర్వే ఆధారంగా వచ్చిన అంచనాలు మాత్రమేనని, ఇవి భవిష్యత్ ఎన్నికల ఫలితాలకు ఖచ్చితమైన సూచికలు కావని గమనించాలి.
అయినప్పటికీ 175 నియోజకవర్గాల్లో 1,90,550 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సంస్థ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి గణనీయమైన సీట్లు వచ్చే అవకాశం ఉందన్న ఈ అంచనాలు.. అధికార కూటమికి రాజకీయంగా హెచ్చరిక సంకేతంగా మారాయి.







