కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ మీడియా సంస్థల కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పాల్గొంటున్న తీరు, వాటికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2026 జూన్‌లో న్యూఢిల్లీలోని తాజ్ హోటల్‌లో(Taj Hotel) రిపబ్లిక్ టీవీ (Republic TV) నిర్వహించిన వార్షిక సమ్మిట్‌కు (Annual Summit) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్టేట్ స్పాన్సర్’గా(State Sponsor) వ్యవహరించిందని, ఇందుకోసం రూ.43,83,583 నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇదే కార్యక్రమంలో నారా లోకేష్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
తాజాగా కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌కు (India Today Conclave) కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ‘స్టేట్ స్పాన్సర్ పార్ట్‌నర్’గా(State Sponsor Partner) వ్యవహరించినట్లు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటించుకోవడం చర్చకు దారితీసింది. దీంతో జాతీయ మీడియా వేదికలపై ప్రభుత్వ భాగస్వామ్యం, అందుకు ఖర్చవుతున్న ప్రజాధనంపై రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ప్రభుత్వ సోషల్ మీడియా ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేసే విధానాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు అర్హులైన ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు సంక్షేమ పథకాలు, ఉద్యోగుల సమస్యలు(Employees’ Issues), ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement), ఆరోగ్యశ్రీ బకాయిలు(Aarogyasri Dues), రైతుల సమస్యల (Farmers’ Issues) విషయంలో నిధుల కొరతను ప్రభుత్వం ప్రస్తావిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందన్న గణాంకాల నేపథ్యంలో ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్నలు కూడా ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.
ఇచ్చిన హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. నాయకుల ప్రచారం, జాతీయ మీడియా కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రచారానికి మాత్రం ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు పాలకుల వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ పెంపునకు ఉపయోగిస్తున్నారా? అన్నదే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారింది.






