---Advertisement---

అప్పుడు విమర్శలు.. ఇప్పుడు చర్యలు? పరిశ్రమల కాలుష్యంపై పవన్ ద్వంద్వ వైఖరి?

June 8, 2026

---Advertisement---

గోదావరి నది కాలుష్యంపై (Godavari River Pollution) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన తాజా వాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. గోదావరిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రా పేపర్ మిల్స్‌కు (Andhra Paper Mills) షోకాజ్ నోటీసులు (Show Cause Notices) జారీ చేయాలని పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) గోదావరి నది కాలుష్య పరిస్థితిని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అక్కడ సేకరించిన నీటి నమూనాలను (Water Samples) ప్రయోగశాలలో పరీక్షించగా, నిర్దేశిత పరిమితులకు మించి ప్రమాదకర రసాయనాలు నదిలో కలుస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించిన పవన్, కాలుష్యం ఇంత తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

నెలకు ఒకసారి నమూనాలు సేకరిస్తున్నామని అధికారులు సమాధానం ఇవ్వగా, అలాంటప్పుడు కాలుష్యం పెరుగుతుంటే చర్యలు ఎందుకు కనిపించలేదని పవన్ నిలదీశారు. వెంటనే ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, అలాగే పర్యవేక్షణలో విఫలమైన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు (Municipal Corporation) కూడా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రాబోయే గోదావరి పుష్కరాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అయితే ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కోణంలో చర్చకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థిస్తుండగా, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో అమర రాజా బ్యాటరీస్‌కు (Amara Raja Batteries) ఇచ్చిన షోకాజ్ నోటీసుల సందర్భాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

జగన్ ప్రభుత్వ కాలంలో పర్యావరణ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో అమర రాజా బ్యాటరీస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆ విమర్శల్లో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి అయ్యారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

దీంతో ప్రస్తుతం గోదావరి కాలుష్యానికి కారణమయ్యాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరైన చర్యగా భావిస్తే, గతంలో అమర రాజా విషయంలో అదే చర్యను ఎందుకు వ్యతిరేకించారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. “జగన్ పాలనలో కాలుష్య నియంత్రణ కోసం నోటీసులు ఇస్తే పరిశ్రమలపై వేధింపులు, ఇప్పుడు అదే చర్యలు తీసుకుంటే పర్యావరణ పరిరక్షణా?” అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజా వైఖరి గత వైఖరి పోల్చుతూ వస్తున్న విమర్శలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment