పశ్చిమాసియాలో (West Asia) పెరుగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ స్టాక్ మార్కెట్లను (Stock Markets) కుదిపేశాయి. యుద్ధ భయాలు(War Fears), ముడి చమురు ధరల (Crude Oil) భారీ పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధరలు ఒక్కసారిగా పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది.
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతానికి పైగా ఎగబాకి బ్యారెల్‌కు (Per Barrel) 97 డాలర్ల సమీపానికి చేరింది. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం(Inflation), దిగుమతి వ్యయం(Import Cost), కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో మార్కెట్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.
భారత స్టాక్ మార్కెట్లలో (Indian Stock Markets) సెన్సెక్స్ 719 పాయింట్లు కోల్పోయి 73,524 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 244 పాయింట్లు పడిపోయి 23,123 స్థాయికి చేరుకుంది. వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లు నష్టాల్లో (Losses) ముగియడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా డాలర్‌తో (Dollar) పోలిస్తే రూపాయి (Rupee) మారకం విలువ రూ.95.53 వద్ద కొనసాగుతోంది. రూపాయి బలహీనత కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. గ్లోబల్ మార్కెట్లలోనూ (Global Markets) ఇదే పరిస్థితి కనిపించింది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.
అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా టెక్నాలజీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఏఐ ఆధారిత ర్యాలీ చాలా వేగంగా పెరిగిందనే అభిప్రాయంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లలో మరింత ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







