పెదకాకానిలోని (Pedakakani) ప్రసిద్ధ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో(Bhramaramba Malleswara Swamy) అమ్మవారి మెడలో ఉండాల్సిన బంగారు మంగళసూత్రం(Mangalsutra), నానుతాడు (Nanutadu) మాయం కావడం కలకలం రేపుతోంది. సుమారు రూ.12 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండా పోవడంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రావణ మాసం (Shravana Month) తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. రెండు రోజుల అనంతరం సోమవారం అలంకరణ తొలగించే సమయంలో మంగళసూత్రం, నానుతాడు కనిపించకపోవడాన్ని పూజారులు గుర్తించారు. తొలుత అలంకరణ సమయంలో పొరపాటున ఎక్కడైనా తీసివేసి ఉంటారేమోనని ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో వెదికినా ఆభరణాలు లభించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో ఐదుగురు అర్చకులను ఆలయ ఈవో లీలాకుమార్ (Leela Kumar) సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఉప ప్రధాన అర్చకుడు జాలయ్యతో(Jalaiah) పాటు విజయ్ ప్రతాప్(Vijay Pratap), విశ్వనాథ్(Viswanath), గాయత్రి మణికణ్ణశాస్త్రి(Gayatri Manikannashastri), కాంట్రాక్ట్ అర్చకుడు గర్నెపూడి గిరికుమార్‌పై (Garnepudi Girikumar) చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే చోరీతో తమకు ఎలాంటి సంబంధం లేదని అర్చకులు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అర్చకుడు రణధీర్‌ను (Randheer) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, దొంగతనం ఒప్పుకోవాలంటూ మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంట్లో సోదాల పేరుతో పోలీసులు మంగళసూత్రాన్ని పెట్టి రణధీర్‌ను నిందితుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన తల్లి మల్లేశ్వరి ఆరోపించారు.
రణధీర్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) దాఖలు చేసినట్లు తెలిపారు. విషయం కోర్టుకు వెళ్లిందని తెలిసిన అనంతరం పోలీసులు రణధీర్‌ను విడిచిపెట్టారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఒకవైపు ఆలయంలో కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఆభరణాలు మాయం కావడం.. మరోవైపు అర్చకులపై చర్యలు, రణధీర్ అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు.. ఈ పరిణామాలతో పెదకాకాని ఆలయ మంగళసూత్రం మాయం కేసు మరింత ఉత్కంఠగా మారింది. అసలు ఆభరణాలు ఎలా మాయమయ్యాయి? ఇందులో ఎవరి పాత్ర ఉంది? దర్యాప్తులో నిజాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.





