డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో(Pithapuram) జనసేన పార్టీ (Jana Sena Party) అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యు.కొత్తపల్లి మండలంలో జనసేన నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారడంతో పార్టీలోని గ్రూపు రాజకీయాలు (Group Politics) బహిర్గతమయ్యాయి. ఈ పరిణామాలతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు పార్టీపై పట్టు తగ్గుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas) వ్యవహారశైలిపై స్థానిక జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం మొదటి నుంచి పనిచేసిన జనసైనికులను పక్కనబెట్టి, ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చినవారికి, తనకు అనుకూలంగా ఉన్న వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలే నియోజకవర్గంలో విభేదాలకు కారణమవుతున్నాయని వారు చెబుతున్నారు.
ఇటీవల చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురంలో పర్యటించడం కూడా స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పార్టీ అంతర్గత సమావేశాలు, కార్యక్రమాలకు సంబంధించి సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పవన్ పర్యటనకు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వినిపించాయి.
అదే సమయంలో పవన్ పర్యటన సాధారణ ప్రజలు, కార్యకర్తలకు దూరంగా ఇనుప కంచెల మధ్య సాగిందనే విమర్శలు కూడా వచ్చాయి. స్థానిక నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సుమారు 7,000 భోజనాలు మిగిలిపోయినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పిఠాపురం జనసేనలో నెలకొన్న అంతర్గత సమీకరణాలు, నాయకత్వం మధ్య సమన్వయంపై చర్చ కొనసాగుతోంది.






