పులివెందుల (Pulivendula) మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు (Mega Water Grid Project) చుట్టూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ వివాదం (Credit Controversy) తెరపైకి వచ్చింది. ఏడు మండలాల్లో సుమారు 5.5 లక్షల మందికి తాగునీరు (Drinking Water) అందించాలనే లక్ష్యంతో రూ.480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission – JJM) కింద ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టు ప్రారంభం, పురోగతి, ప్రస్తుత వేగం విషయంలో వైఎస్సార్‌సీపీ(YSRCP), కూటమి ప్రభుత్వం (Coalition Government) మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) శంకుస్థాపన చేశారు. 2024లో ప్రభుత్వం మారే సమయానికి పనులు గణనీయంగా ముందుకు సాగాయని, దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థతో పాటు వైఎస్సార్‌సీపీ కూడా చెబుతోంది.
అయితే తాజా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రెండున్నరేళ్ల కూటమి పాలనలో ప్రాజెక్టు పనులు 80 శాతం నుంచి 96 శాతానికి చేరుకున్నాయి. అంటే రెండున్నరేళ్లలో కేవలం 16 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టు పనుల్లో కేవలం 16 శాతం మాత్రమే పూర్తి చేసి, ఇంకా నాలుగు శాతం పనులు మిగిలి ఉండగానే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తామే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎలా చెబుతారని పులివెందుల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 80 శాతం పనులు పూర్తి చేసిన ప్రభుత్వాన్ని తక్కువగా చూపించే ప్రయత్నం చేయడమంటే క్రెడిట్ చోరీకి పాల్పడటమేనని, ఇలాంటి రాజకీయాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
జగన్‌పై బురద జల్లాలనే తొందరలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అవగాహనారాహిత్య ప్రకటనలతో ప్రజల్లో రోజురోజుకూ పలుచన అవుతున్నారని విపక్షం విమర్శిస్తోంది. తన శాఖల పనితీరు అధ్వానంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ క్షమించరని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.






