ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పారిశ్రామికాభివృద్ధి(Industrial Development), పెట్టుబడుల ఆకర్షణ (Investment Attraction) పేరుతో కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు భారీగా భూములు(Lands), ప్రభుత్వ రాయితీలు (Government Incentives) కేటాయిస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా రావోక్స్ అగ్రీటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు (Raovox Agritech India Private Limited) సంబంధించిన కేటాయింపులు, ప్రోత్సాహకాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పరిశ్రమల శాఖ జారీ చేసిన జీవో 259 ప్రకారం.. విశాఖపట్నం (Visakhapatnam) చిరునామాతో 2025 నవంబర్ 20న నమోదైన రావోక్స్ అగ్రీటెక్ సంస్థకు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్ రెవెన్యూ గ్రామంలో ఏపీఐఐసీ (APIIC) ద్వారా 40.50 ఎకరాల భూమి కేటాయించినట్లు పేర్కొంది. సంస్థకు ₹10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్(Authorized Capital), ₹9 లక్షల పెయిడ్-అప్ క్యాపిటల్ (Paid-up Capital) ఉన్నట్లు వివరాలు సూచిస్తున్నాయి. దేవి ప్రసాద్ ముళ్ళూరు, కీర్తి వినాయక్ కంబం సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారు.
ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ (Integrated Food Park) ఏర్పాటుకు ₹1,388.14 కోట్ల పెట్టుబడి, 1,000 ప్రత్యక్ష ఉద్యోగాల హామీ ఇచ్చిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం మొత్తం ₹592.22 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ₹272.64 కోట్ల క్యాపిటల్ సబ్సిడీ, ₹280.83 కోట్ల నెట్ ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, విద్యుత్ ఛార్జీలపై ₹18.60 కోట్ల రాయితీ, ₹18.60 కోట్ల ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, ₹1 కోటి వడ్డీ రాయితీ, ₹0.55 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉన్నాయి.
అయితే ₹9 లక్షల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న సంస్థ ₹1,388 కోట్ల పెట్టుబడిని ఏ విధంగా సమకూర్చనుంది? ప్రాజెక్టు ఆర్థిక సామర్థ్యం, బ్యాంకు హామీలు, పెట్టుబడి సమీకరణపై ప్రభుత్వం ఎలాంటి పరిశీలన చేసింది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
రావోక్స్ అగ్రీటెక్తో పాటు ఉర్సా క్లస్టర్స్(Ursa Clusters), ఇండిచిప్ సెమికండక్టర్స్(Indichip Semiconductors), గ్రైడన్ ఎనర్జీ(Gridon Energy), ఎన్ఏఎన్ గ్రీన్మెట్, స్కై స్టోరేజ్ సొల్యూషన్స్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వంటి కొత్తగా ఏర్పాటైన సంస్థలకు భూములు, రాయితీలు కేటాయించిన అంశాలపై కూడా ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంస్థలు భారీ పెట్టుబడులు, ఉద్యోగాల హామీలు ఇచ్చినప్పటికీ వాటి అనుభవం, ఆర్థిక సామర్థ్యం, ప్రాజెక్టుల అమలు స్థితిపై ప్రభుత్వం మరింత పారదర్శకత చూపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'(Speed of Doing Business) పేరుతో ప్రభుత్వ భూములు, పన్ను రాయితీలు కేటాయించే సమయంలో కంపెనీల ఆర్థిక బలం, పెట్టుబడి సామర్థ్యం, బ్యాంకు గ్యారెంటీలు, గత అనుభవం, ప్రాజెక్టు అమలు సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తున్నారనే అంశం కీలకంగా మారింది. కేటాయించిన భూముల్లో ప్రాజెక్టులు ప్రారంభం కాకపోతే ప్రజా ఆస్తులు నిరుపయోగంగా మారే అవకాశం ఉండటంతో.. కొత్త కంపెనీలకు జరిగిన భూ కేటాయింపులు, రాయితీలపై ప్రభుత్వం సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.





