లక్ష కోట్ల అంచనా వ్యయంతో ‘రాయలసీమ రైజింగ్’(Rayalaseema Rising) పేరుతో ఉద్యాన పంటల కేంద్రం, పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో రాయలసీమకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు(Irrigation projects), విద్యా–వైద్య సంస్థలు(Educational And Medical Institutions), బ్యాంకింగ్, పారిశ్రామిక కేంద్రాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Rayalaseema Lift Irrigation Project) పనులు నిలిచిపోవడం, శ్రీశైలంలో నీటిమట్టం ఉన్నప్పటికీ కేసీ కెనాల్(KC Canal) ఆయకట్టుకు సాగునీరు అందకపోవడం వంటి అంశాలు సీమ రైతాంగంలో ఆందోళనకు కారణమవుతున్నాయి.
తిరుపతికి(Tirupati) మంజూరైన నైలెట్ సంస్థను(NIELIT institute) అమరావతికి తరలించడం, అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి మార్చడం, పులివెందుల మెడికల్ కాలేజీకి(Pulivendula Medical College) మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కడపలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (Andhra Pradesh Grameena Bank) ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే నిర్ణయం, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఏర్పాటు చేయాల్సిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి మార్చడం వంటి నిర్ణయాలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక గతంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్న పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుందని చెప్పడంపైనా సీమ ప్రాంత నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒకవైపు ‘రాయలసీమ రైజింగ్’(Rayalaseema Rising) పేరుతో భారీ ఈవెంట్లు నిర్వహిస్తూ బుల్లెట్ ట్రైన్, హైపర్‌లూప్ వంటి ప్రతిపాదనలను ప్రస్తావించడం, మరోవైపు తక్షణ అవసరమైన సాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా తరలింపులు జరగడం ఏమిటని వారు నిలదీస్తున్నారు.
రాయలసీమ వంటి కరువు ప్రభావిత ప్రాంతానికి అభివృద్ధి అంటే కేవలం భారీ ప్రకటనలు, ఈవెంట్లు కాదని, నీటి భద్రత, వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడమే నిజమైన అభివృద్ధి అని విమర్శకులు పేర్కొంటున్నారు. ‘రాయలసీమ రైజింగ్’(Rayalaseema Rising) పేరుతో ప్రకటిస్తున్న లక్ష్యాలకు, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలకు మధ్య ఉన్న వ్యత్యాసమే ఇప్పుడు ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నిస్తూ ప్రధాన చర్చగా మారింది.






