దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) మళ్లీ చురుగ్గా మారాయి. దీంతో సెప్టెంబర్ తొలి వారంలో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (India Meteorological Department – IMD) వెల్లడించింది. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం(Low Pressure Area), రుతుపవన ద్రోణి, అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమతో కూడిన గాలుల ప్రభావంతో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ(Telugu States) వర్షాల ప్రభావం కొనసాగనుంది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 5వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, శ్రీలంక పరిసర ప్రాంతాలు, అండమాన్ సముద్రం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అలలు ఉధృతంగా ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది.
ఇక తెలంగాణలో(Telangana) రానున్న 2 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.





