టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కుమార్తె (Daughter) సుకృతి వేణి (Sukrithi Veni) చిన్న వయసులోనే సినీ, సంగీత రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘గాంధీ తాత చెట్టు’(Gandhi Tatha Chettu) సినిమాతో బాలనటిగా (Child Artist) వెండితెరకు పరిచయమైన ఆమె.. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అత్యుత్తమ నటనకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా (Best Child Artist) ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
నటనతో పాటు గాయనిగా కూడా సుకృతి వేణి తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటీవల దక్షిణ కొరియాలో (South Korea) జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో ప్రధాన గాయనిగా (Lead Singer) ప్రదర్శన ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో (International Level) ప్రశంసలు (Appreciation) అందుకున్నారు. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ప్రముఖ బర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో (Berklee College of Music) తన ప్రతిభను ప్రదర్శించినందుకు సుకృతి వేణికి ‘ఎన్‌సెంబుల్ ఎక్సెలెన్స్ అవార్డు’ (Ensemble Excellence Award) లభించింది. అంతేకాకుండా ఆ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే పూర్తి ఉపకార వేతనాన్ని కూడా ఆమె సాధించారు.
ఈ అత్యంత పోటీతో కూడిన ఉపకార వేతన ఆడిషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 272 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. వారిలో కేవలం 14 మందిని మాత్రమే పూర్తి ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. ఇందులో గాయనుల విభాగం నుంచి పూర్తి ఉపకార వేతనం అందుకున్న ఏకైక విద్యార్థిగా సుకృతి వేణి నిలిచారు.
చిన్న వయసులోనే నటిగా, గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధిస్తున్న సుకృతి వేణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. తండ్రికి తగ్గ తనయగా భారతదేశ ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న సుకృతి వేణికి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.







