---Advertisement---

తౌషిక్‌ మృతికి న్యాయం కోరిన తల్లి మౌలాబి ఆత్మహత్య!

September 12, 2026

Summarize with AI

---Advertisement---

ప్రకాశం జిల్లా (Prakasam District) సింగరాయకొండ మండలం (Singarayakonda Mandal) మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో(Sri Chaitanya Navodaya School) ఫిబ్రవరి 14న కనిగిరికి చెందిన ఆరో తరగతి విద్యార్థి షేక్‌ తౌషిక్‌ (Sheikh Toushiq) (11) హాస్టల్‌ బాత్‌రూంలో (Hostel Bathroom) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. తన కుమారుడి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని హాస్టల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తౌషిక్‌ తల్లి మౌలాబి (Moulabi) నెలలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.

తన కుమారుడు మృతికి సంబంధించి నిజాలు వెలుగులోకి రావాలని, బాధ్యులను గుర్తించి శిక్షించాలని ఆమె పలుమార్లు అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అసెంబ్లీ (Assembly) ఎదుట కూడా నిరసన చేపట్టినప్పటికీ తమకు తగిన న్యాయం, స్పష్టమైన భరోసా లభించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు, ఓదార్పు మాటలు తప్ప బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం (Government) ముందుకు సాగలేదని వారు ఆరోపించారు.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మౌలాబి రెండు రోజుల క్రితం ఎప్పటిలాగే పాఠశాల (School) ఎదుట నిరసన దీక్షకు కూర్చున్నారు. సుమారు గంట తర్వాత ఆమె గడ్డిమందు తాగేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న మహిళా హోంగార్డు (Woman Home Guard) గమనించి ఆమె చేతిలోని డబ్బాను పక్కకు నెట్టివేశారు. అయితే అప్పటికే కొంతమేర మందు తీసుకోవడంతో వెంటనే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎస్సై లేళ్ల సుధీర్‌కుమార్‌ (Lella Sudheer Kumar సంఘటనా స్థలానికి చేరుకుని మౌలాబిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు (Ongole RIMS) తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మౌలాబి శనివారం ఉదయం మృతిచెందారు.

కుమారుడి మృతికి న్యాయం కోసం నెలల తరబడి పోరాడిన తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తౌషిక్‌ మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment