కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు శివారులోని వెస్ట్ బైపాస్ టోల్‌ప్లాజా వద్ద దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు (Chintamaneni Prabhakar) చెందినవిగా చెబుతున్న టిప్పర్ లారీలు హల్‌చల్ చేశాయి. ఏలూరు నుంచి కొండపల్లి వైపు వెళ్తున్న 18 టిప్పర్లను టోల్‌ఫీజు చెల్లించాలని సిబ్బంది అడ్డుకోవడంతో డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. తమ వాహనాలకు టోల్‌ఫీజు (Toll Fee) ఎందుకు చెల్లించాలంటూ సిబ్బందితో గొడవకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
టోల్‌ఫీజు చెల్లించకుండా పంపించేది లేదని సిబ్బంది స్పష్టం చేయడంతో డ్రైవర్లు(Drivers) టిప్పర్లను టోల్‌గేట్‌కు అడ్డంగా నిలిపివేశారు. దీంతో వెస్ట్ బైపాస్‌పై సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలుగు అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ప్రత్యామ్నాయ మార్గంలో తరలించాల్సి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగినా డ్రైవర్లు పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరకు 10 టిప్పర్లు టోల్‌గేట్‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోగా, మరో 8 వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఓ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత టోల్‌గేట్ల వద్ద టీడీపీ(TDP) నేతలు, వారి అనుచరుల దౌర్జన్యాలకు సంబంధించిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలో వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్‌గేట్ వద్ద కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendra Babu) వాహనాన్ని ఆపినందుకు అనుచరులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. మహిళా సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు సమాచారం.
అలాగే నందవరం మండలం హాలహర్వి టోల్‌గేట్ వద్ద టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి (Palakurthi Srinivas Reddy) టోల్ వసూలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని దూషించి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం పరిసరాల్లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (Budda Rajasekhar Reddy) వర్గీయులు టోల్ ఉద్యోగిని(Toll Employee) బలవంతంగా కారులో తీసుకెళ్లిన ఘటన కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
టోల్‌ఫీజు చెల్లింపు వంటి సాధారణ అంశాలు అధికార దర్పాన్ని ప్రదర్శించే వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. టోల్‌గేట్ల వద్ద వరుసగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అధికార అండతో దౌర్జన్యాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.






