---Advertisement---

టీడీపీ సీనియర్ నేత ఈడుపుగంటి శ్రీనివాస్ బాబుపై సస్పెన్షన్ వేటు.

June 15, 2026

---Advertisement---

దెందులూరు నియోజకవర్గ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై బహిరంగంగా అక్రమాల ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్ బాబును పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు ఇంటి వద్దకు వెళ్లి హల్చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందనే చర్చ కొనసాగుతున్న వేళ, చింతమనేనిపై ఆరోపణలు చేసిన శ్రీనివాస్ బాబుపైనే చర్యలు తీసుకోవడం పలు ప్రశ్నలకు కారణమవుతోంది.

గతంలో చింతమనేనికి న్యాయవాదిగా వ్యవహరించిన ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు, గత కొంతకాలంగా దెందులూరులో జరుగుతున్నట్లు తాను ఆరోపిస్తున్న అక్రమాలపై వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా విస్తరించిందని, దానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రధాన బాధ్యత వహిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

తన ప్రెస్‌మీట్‌లో దెందులూరులో మద్యం దుకాణాల టెండర్లు ఒత్తిడి వాతావరణంలో జరిగాయని, ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద గూండాలను మోహరించి ఇతరులను వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ధైర్యంగా టెండర్లలో పాల్గొన్న వారి దుకాణాలను కూడా బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.

అంతేకాకుండా, నియోజకవర్గంలో ఏ లైసెన్స్‌తో ఏ దుకాణాలు నడుస్తున్నాయో స్పష్టత లేదని, “సాయి బాలాజీ వైన్స్” పేరుతోనే వ్యాపారం సాగుతోందని, ఆ సంస్థ యాజమాన్యం ఎవరిదనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. అబ్కారీ, పోలీసు శాఖలు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని, ప్రతిపక్ష నాయకులను కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు.

కొత్త రాజకీయ పార్టీ కోసం నిధులు సమీకరించే ఉద్దేశంతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని, దెందులూరులో అధికారికంగా 17 వైన్ షాపులు ఉన్నప్పటికీ 350కి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి మద్యం సీసాపై రూ.10 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.

“చింతమనేనిని ప్రశ్నించే పరిస్థితి లేదని, మీడియా ప్రశ్నిస్తే వారిపైనే దాడులు జరుగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ అంశాలను బయటపెడుతున్నానని, గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదనే ధైర్యంగా మాట్లాడుతున్నానని” శ్రీనివాస్ బాబు తన వ్యాఖ్యల్లో వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో చింతమనేనిపై వచ్చిన ఆరోపణలపై కాకుండా, వాటిని బహిరంగంగా లేవనెత్తిన పార్టీ సీనియర్ నేత ఈడుపుగంటి శ్రీనివాస్ బాబుపై సస్పెన్షన్ వేటు పడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగా, పార్టీ అంతర్గత వ్యవహారాలు మరియు దెందులూరు రాజకీయాలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment