తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు(K. Keshava Rao), విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా(Yogita Rana), పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ (Naveen Nicholas) బుధవారం మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించారు. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనంద వాతావరణం నెలకొంది.
ఈసారి కూడా బాలికలు (Girls) తమ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. మొత్తం ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా నమోదైంది. దీంతో తెలంగాణలో విద్యా రంగంలో బాలికల ఆధిపత్యం కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కే. కేశవరావు అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. క్షణికావేశంలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు తెలంగాణ పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాయడంతో ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు bse.telangana.gov.in మరియు results.bsetelangana.org ద్వారా చూసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు సులభంగా పొందే సదుపాయం కల్పించింది.
ఈసారి ఫలితాల్లో కొత్త మార్పులు తీసుకువచ్చారు. కేవలం గ్రేడ్లు మాత్రమే కాకుండా, సబ్జెక్టుల వారీగా మార్కులు కూడా అందుబాటులో ఉంచారు. దీంతో విద్యార్థులు తమ ప్రతిభను స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం లభించింది.
ఈ ఏడాది మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని అధికారులు తెలిపారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 92.78 శాతం ఉండగా, ఈసారి 2.37 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో ఈసారి ఫలితాలు మరింత మెరుగ్గా ఉన్నాయని విద్యాశాఖ పేర్కొంది.
WhatsApp ద్వారా SSC ఫలితాలు ఇలా పొందండి
- మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను MeeSeva Telangana పేరుతో సేవ్ చేసుకోండి.
- WhatsApp ఓపెన్ చేసి Hi అని మెసేజ్ పంపండి.
- తరువాత SSC Result అని టైప్ చేయండి.
- మెనులో కనిపించే Open Service ఎంపికపై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
- వెంటనే మీ మార్కుల మెమో WhatsAppలో అందుతుంది.






