కర్ణాటకలో(Karnataka) ఘోర రైలు ప్రమాదం (Major Train Accident) చోటుచేసుకుంది. బెంగళూరు (Bengaluru) రూరల్ జిల్లా దొడ్డబళ్లాపుర రైల్వే స్టేషన్‌లో (Doddaballapura Railway Station) జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళతో పాటు ఇద్దరు బాలికలు ఉన్నారు.
ఆదివారం సెలవు కావడంతో అనంతపురం జిల్లా హిందూపురానికి(Hindupur) చెందిన ఇర్ఫానా (46) తన ఇద్దరు బాలికలు కురియా (13), రాకియా (8)తో కలిసి దొడ్డబళ్లాపురలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.
రైలు ఎక్కేందుకు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లే క్రమంలో ముగ్గురూ రైల్వే ట్రాక్ (Railway Track) దాటేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న యలహంక రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
మృతులను ఇర్ఫానా (Irfana) (46), కురియా(Kuria) (13), రాకియా (Rakia) (8)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.





