రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’(Toxic) విడుదలకు సిద్ధమవుతోంది. గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది.
ఈ ప్రచారంలో భాగంగా తాజాగా సినిమా నుంచి మొదటి పాట ‘తబాహి’(Tabahi) వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటతో చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ అన్ని భాషల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో వేగంగా ట్రెండ్ అవుతోంది.
‘తబాహి’ సాంగ్‌లో యష్, కియారా అద్వానీ మధ్య చూపించిన రొమాంటిక్ కెమిస్ట్రీ (Romantic Chemistry) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఇద్దరి మధ్య కనిపించిన ప్రేమ, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మరోవైపు కియారా అద్వానీ గ్లామర్ లుక్ ఈ పాటకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో విడుదలైన ఈ లవ్ ట్రాక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ పాటను కియారా అద్వానీ తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ, “తప్పు-ఒప్పుల భావనలకు ఆవల ఒక మైదానం ఉంది… నేను నిన్ను అక్కడ కలుస్తాను” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా కలిసి సంగీతాన్ని సమకూర్చారు. ప్రస్తుతం ‘తబాహి’ పాట యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో భారీ స్పందనతో వైరల్‌గా మారుతోంది.






