తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సంచలన మార్పులకు తెరలేచింది. సినీ నటుడు విజయ్ (Vijay) ఇప్పుడు అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ గవర్నర్ (Governor) రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్(Rajendra Vishwanath Arlekar), టీవీకే పార్టీని (TVK Party) ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో రేపు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది.
మెజారిటీకి 10 సీట్లు తక్కువ వచ్చినప్పటికీ, అనూహ్య రాజకీయ పరిణామాలతో విజయ్‌కు మద్దతు వెల్లువెత్తింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) 5 స్థానాలు, సీపీఐ (CPI) 2, సీపీఎం (CPM) 2, వీసీకే (VCK) 2 స్థానాలతో మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి బలం 118కు చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను విజయ్ సునాయాసంగా అందుకున్నారు.
ద్రవిడ రాజకీయాల్లో కొత్త అధ్యాయం
1977 తర్వాత తమిళనాడులో డీఎంకే(DMK), అన్నాడీఎంకే (AIADMK) కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేవలం రెండేళ్ల క్రితం రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్, తొలి ప్రయత్నంలోనే సీఎం కుర్చీ దక్కించుకోవడం దేశ రాజకీయాల్లోనే పెద్ద సంచలనంగా మారింది. అభిమానుల మద్దతు, యువతలో ఉన్న క్రేజ్, మార్పు కోరుకున్న ప్రజల భావోద్వేగాలు విజయ్ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
చెన్నైలో భారీగా ఏర్పాట్లు
రేపు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం (Jawaharlal Nehru Indoor Stadium) ఇప్పటికే సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశముంది. భారీ జనసందోహం దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
“తమిళనాడు ప్రజల ఆశీస్సులతో కొత్త శకం ప్రారంభం కానుంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజలకు స్థిరమైన పాలన అందిస్తాం” అని టీవీకే వర్గాలు ప్రకటించాయి.






