తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) (TVK) అధినేత విజయ్ (Vijay) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ (Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) అధికారికంగా ఆహ్వానం పలికారు. మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్‌ను గవర్నర్ కోరారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని (Chennai) జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో (Jawaharlal Nehru Indoor Stadium) విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Oath Ceremony)చేయనున్నారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.
120కు చేరిన కూటమి బలం
తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు విదుతలై చిరుతైగల్ కచ్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ నేతృత్వంలోని కూటమి బలం 120కి చేరుకుంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 కాగా, దానికంటే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో విజయ్ సీఎం పీఠం ఖాయమైంది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
చెన్నై వీధుల్లో బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు విజయ్ ప్రకటించిన నాటి నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ద్రావిడ రాజకీయాల్లో కొత్త అధ్యాయం
తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ రాజకీయాల (Dravidian Politics) మధ్య, ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజకీయ ప్రవేశం మొదటి నుంచే సంచలనం సృష్టించగా, ఇప్పుడు సీఎం పదవి చేపట్టడం తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.






