విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (Sri Durga Malleswara Swamy Varla Devasthanam) పాలకమండలి సమావేశం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ(Borra Radhakrishna) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాబోయే శరన్నవరాత్రి దసరా మహోత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.
ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు దసరా మహోత్సవాలను (Dasara Celebrations) వైభవంగా నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, భద్రత, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
అక్టోబర్ 11న శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంతో (Sri Lalitha Tripura Sundari Devi) ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. 12న శ్రీ గాయత్రీదేవి, 13న శ్రీ అన్నపూర్ణదేవి, 14న శ్రీ మహాచండీదేవి అలంకారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
అక్టోబర్ 15న శ్రీ లలితా త్రిపురసుందరీదేవి, 16న శ్రీ సరస్వతిదేవి, 17న శ్రీ మహాలక్ష్మిదేవి, 18న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషాసురమర్ధిని అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 20న ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారు కొలువుదీరనున్నారు.
ముగింపు రోజైన అక్టోబర్ 20న సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీనిని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పాలకమండలి అధికారులను ఆదేశించింది. పోలీసు శాఖ, ఘాట్ నిర్వహణ విభాగాలతో సమన్వయం చేసుకుని భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించింది.





