జీవన పోరాటంలో భాగంగా నావలెక్కి కడలి ఒడిలోకి వెళ్లిన ఆరుగురు గంగపుత్రులు ఏమయ్యారో తెలియక వారి ఇళ్లు కన్నీటి సంద్రాలుగా మారాయి. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన యంత్రాంగం కనీస మానవత్వం చూపకుండా గాలింపు చర్యలను అర్ధాంతరంగా నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
అంతటితో ఆగకుండా, తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న కుటుంబాలపై పోలీసులను ప్రయోగించి వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, తమ గోడు వినే నాథుడే లేడా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం గల్లంతైన వారు ప్రాణాలతో ఉన్నారా? లేక సముద్ర గర్భంలోనే కలిసిపోయారా? అన్న విషయాన్ని నిర్ధారించకుండానే గాలింపు చర్యలను ఎలా నిలిపివేస్తారని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మనిషి ప్రాణానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం ద్వారా బాధ్యత ముగిసిపోయిందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం తమకు ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “మా వాళ్లు బతికుంటే ప్రాణాలతో తీసుకురండి.. లేకపోతే వారి మృతదేహాలైనా అప్పగించండి” అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాయి. అయితే వారి ఆర్తనాదాలు పాలకుల చెవికి చేరడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయిన్ల్యాండ్పైనే కనిపించకుండా పోయిన జ్ఞానేశ్వరి, వాసంతి వంటి వారిని ఇప్పటికీ గుర్తించలేకపోయిన ప్రభుత్వం, సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించగలదనే నమ్మకం ప్రజల్లో ఎలా కలుగుతుందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని భావించడం అత్యాశేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఘటన జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమన్వయం చేసి, చివరి వరకు గాలింపు చర్యలు కొనసాగించి గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించాల్సిన సమయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వైఖరి బాధిత కుటుంబాల్లో మరింత ఆవేదనను, ప్రజల్లో తీవ్ర నిరాశను మిగిల్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






