విశాఖపట్నంలో(Visakhapatnam) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు (Village and Ward Secretariat Employees) తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. ద్వారకా బస్‌స్టేషన్ (Dwaraka Bus Station) ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్ని మార్గాలను ఉద్యోగులు దిగ్బంధించడంతో పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
జీవో నం.11ను (GO No.11) రద్దు చేయాలని, డిప్యూటేషన్లు (Deputations) నిలిపివేసి ప్రమోషన్లు కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు, ప్రొబేషన్ ఆలస్యానికి సంబంధించిన 9 నెలల బకాయిలు, వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి కనీస మూల వేతనం రూ.30 వేలకు తగ్గకుండా ప్రమోషన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మూడు నెలల్లోగా అన్ని ప్రయోజనాలు అందించడంతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని, సాయంత్రం 5 గంటల తర్వాత వాట్సాప్ సందేశాల ద్వారా ఉద్యోగులను వేధించడం ఆపాలని, సెలవు రోజుల్లో విధులు నిర్వహిస్తే పరిహార సెలవు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జోన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగుల నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మద్దతు ప్రకటించింది. విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు(K.K. Raju) మాట్లాడుతూ.. ప్రజలకు ఇంటి ముంగిటే ప్రభుత్వ సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కక్షసాధింపు ధోరణి వీడి వారితో చర్చలు జరపాలని కోరారు.





