సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. జట్టుకు 2016లో ఏకైక ఐపీఎల్ టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను (David Warner) సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే విషయం బయటకు రావడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) స్టోరీ పెట్టే ప్రయత్నంలో ఎస్‌ఆర్‌హెచ్ (SRH) అధికారిక ఖాతా కనిపించకపోవడంతో వార్నర్‌కు అనుమానం వచ్చింది. అనంతరం స్క్రీన్‌షాట్ల ద్వారా తాను బ్లాక్(Blocked) చేయబడ్డానని స్వయంగా వెల్లడించడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది.
2021 ఐపీఎల్ సీజన్ మధ్యలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా పక్కన పెట్టడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి పూర్తిగా విడుదల చేయడంతో ఫ్రాంచైజీతో అతని సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా బ్లాక్ వ్యవహారం బయటపడటంతో అప్పటి విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 95 మ్యాచ్‌లు ఆడి 4,014 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలతో జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. ముఖ్యంగా 2016 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై(RCB) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ (IPL Trophy) అందించాడు. అలాంటి ఆటగాడిని ఫ్రాంచైజీ ఈ విధంగా ట్రీట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టుకు చరిత్ర సృష్టించిన కెప్టెన్‌కు కనీస గౌరవం ఇవ్వలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు “వార్నర్ లేకపోతే ఎస్‌ఆర్‌హెచ్‌కు టైటిల్ వచ్చేదే కాదు” అంటూ పోస్టులు పెడుతుండగా, మరికొందరు ఫ్రాంచైజీ వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు.






