---Advertisement---

డీఎస్సీ అక్రమాలపై జగన్ సంచలన సవాల్‌.. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

September 5, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజురోజుకూ కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయని, ఇవి డీఎస్సీ నియామకాల్లో పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల సోషల్‌ మీడియా ఖాతాలు, పోస్టులను మెటా నియంత్రిస్తోందని జగన్‌ ఆరోపించారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఖాతాలు, పేజీలను తొలగించడం లేదా జియోబ్లాక్‌ చేయడం జరుగుతోందని అన్నారు. సాక్షి టీవీ, సాక్షి డిజిటల్‌, బిగ్‌ టీవీ, జగనన్న కనెక్ట్స్‌తో పాటు డీఎస్సీ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్‌ కూడా ఆంక్షలకు గురయ్యాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని ఎన్నికల హామీలు, అధికార దుర్వినియోగంపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగన్‌ విమర్శించారు. వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని, రాజకీయంగా ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు వాటిని అణచివేయడం సరికాదని అన్నారు.

డీఎస్సీ పరీక్ష రాయకుండానే, టెట్‌లో ఉత్తీర్ణత సాధించకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎలా కల్పించారని జగన్‌ ప్రశ్నించారు. అలాగే స్పోర్ట్స్‌ కోటా నియామకాల కోసం కొత్త జీఓలు తీసుకొచ్చి, నియామకాలు పూర్తయిన అనంతరం వాటిని రద్దు చేయడంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. రద్దు చేసిన జీఓల ఆధారంగా నియమితులైన వారు ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని ఆరోపిస్తూ, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

“చంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా?” అంటూ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం భావిస్తే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించి నిజానిజాలను ప్రజల ముందుంచాలని సవాల్‌ చేశారు.

అంతేకాకుండా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. నియంత్రించిన సోషల్‌ మీడియా ఖాతాలు, పోస్టులు, కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని, సెన్సార్‌షిప్‌ను నిలిపివేయాలని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరారు.

“ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు.. ఒక ఖాతాను బ్లాక్‌ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు” అంటూ జగన్‌ వ్యాఖ్యానించారు. డీఎస్సీ నియామకాల్లో దాచుకోవడానికి ఏమీ లేకపోతే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ ఆయన చేసిన సవాల్‌ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment