రెండేళ్ల కూటమి పాలనలో విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు, పరిపాలనా వైఫల్యాలపై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధికంగా పర్యటించిన నగరం కూడా విశాఖేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడిన బాధితులను అనకాపల్లి ఆసుపత్రిలో వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
సింహాచలం దేవస్థానంలో నాసిరకం నిర్మాణంతో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన అనంతరం విశాఖపట్నం మధురవాడలోని చంద్రంపాలెంలో బాధితులు ఉమామహేష్, శైలజ భౌతికకాయాలకు నివాళులర్పించిన జగన్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే విశాఖ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లిన సందర్భంగా మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించడంతో పాటు, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన విద్యార్థులను కూడా పరామర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం తర్వాత సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను, వారి కుటుంబ సభ్యులను కలుసుకుని జగన్ భాదిత కుటుంభాలను పరామర్శించారు.
తాజాగా మరోసారి విశాఖ పర్యటనకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు జబ్బర్‌తోటలోని వారి నివాసాలకు వెళ్లనున్నారు.
ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖ నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిపాలనా లోపాల కారణంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బాధితులను స్వయంగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం వల్ల అయినా తమ గోడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోందని కొందరు విశాఖవాసులు చెబుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






