దెందులూరు (Denduluru) తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) మరోసారి వివాదాల కేంద్రంగా మారారు. ఆదివారం అర్ధరాత్రి (Midnight) ఏలూరు (Eluru) నగరంలో ఆయన చేసిన హల్చల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సొంత పార్టీకే చెందిన సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు (Eedpuganti Srinivas Babu) ఇంటి వద్ద ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి చేసిన రచ్చ స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. రాత్రి 11 గంటల సమయంలో ఏకంగా పొక్లెయిన్ల్ (JCB) వెంటబెట్టుకుని లాయర్ ఇంటి వద్దకు వెళ్లిన చింతమనేని అక్కడ భారీ ఉద్రిక్తత సృష్టించారు.
ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు నిద్రిస్తున్న సమయంలో భారీ అనుచర గణంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే(MLA) తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై నిలబడి పెద్ద ఎత్తున అరుస్తూ “వాడో నేనో తేలాలి.. చంపేస్తా” అంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచిపోయి, పోలీసుల సమక్షంలోనే ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు దిగడం అక్కడ ఉన్న వారిని షాక్‌కు గురిచేసింది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో చింతమనేనిని శాంతింపజేయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. “వద్దు నాన్న.. ప్లీజ్ వెళ్లిపోదాం” అంటూ కుమార్తె ఎంత బతిమాలినా ఆయన వెనక్కి తగ్గలేదు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీతో (DSP) కూడా ఎమ్మెల్యే తీవ్ర వాగ్వాదానికి దిగారు. “నన్నెవరు ఆపుతారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి 1 గంట వరకు ఏలూరు వీధుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగింది.
చింతమనేని ప్రభాకర్‌కు వివాదాలు కొత్తేమీ కావు. గతంలో కూడా ఆయన పలుమార్లు వివాదాస్పద ఘటనల్లో నిలిచారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం, పోలీసులను బెదిరించడం(Police Threatening), ల్యాండ్ సెటిల్మెంట్లు(Land Settlements), ఇసుక అక్రమ రవాణాను (Illegal Sand Transportation) ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై (Vanajakshi) అనుచరులతో కలిసి దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా పోలీసులతో ఘర్షణలు, కుల దూషణ కేసులు, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచారు. తాజాగా సొంత పార్టీ నేత ఇంటినే లక్ష్యంగా చేసుకుని, అర్ధరాత్రి పొక్లెయిన్లతో రోడ్లపై చేసిన వీరంగం చూస్తుంటే చింతమనేని తన పాత శైలిని ఇప్పటికీ మార్చుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.






