విజయవాడలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై కూటమి ప్రభుత్వం స్పందించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని నిర్ణయించడంతో పాటు, సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ప్రకటించింది. అయితే నెల రోజులుగా సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం స్పందించకపోవడం, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించిన అనంతరం చర్యలు ప్రకటించడం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం ప్రకటించిన చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని, నిజంగా లాకప్ డెత్ జరిగిందా లేదా అన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం ఆశ్చర్యకరమని పౌరహక్కుల సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
లాకప్ డెత్ ఘటనలకు బాధ్యులైన పోలీసు అధికారులపై కేవలం శాఖాపరమైన చర్యలు సరిపోవని, థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి ప్రాణాలు తీసినట్లయితే అది హత్యతో సమానమేనని, సంబంధిత అధికారులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా, ఇటువంటి కేసుల్లో నిష్పాక్షిక విచారణ జరగాలంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించాలనీ, లేదా విచారణను సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ద్వారానే విచారణ జరిగితే వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని విమర్శకులు పేర్కొంటున్నారు.
బాధిత కుటుంబం కోరుకునే స్థాయిలో దర్యాప్తు చేపట్టి, నిర్దిష్ట గడువులో విచారణ పూర్తి చేసి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు అంటున్నారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా, కాలయాపనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల్లో అంశాన్ని పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.






