ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం అధికారంలోకి (Coalition Government) వచ్చిన తర్వాత చోటుచేసుకున్న కొన్ని మిస్సింగ్ కేసులు (Missing Cases) ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని కేసుల్లో ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి కనిపించకపోవడంపై వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో అదృశ్యమైన ఎనిమిదేళ్ల బాలిక వాసంతి కేసు (Vasanthi Case) ఇప్పటికీ మిస్టరీగా కొనసాగుతోంది. బాలిక(Girl) కనిపించకుండా పోయిన ఘటనకు ఇప్పటికే 712 రోజులు దాటినా ఆమె ఆచూకీ గానీ, ఆమెకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు గానీ వెలుగులోకి రాలేదు. ప్రారంభ దశలో కొంతమంది మైనర్ బాలురను విచారించినప్పటికీ కేసు దర్యాప్తులో ఆశించిన ఫలితాలు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అలాగే తునిలో(Tuni) అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు (Gnaneswari Case) కూడా ప్రజలను కలవరపెడుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి రెండు వారాలకు పైగా గడిచినా ఆమె జాడ ఇప్పటికీ లభించలేదు. చిన్నారితో పాటు ఉన్న పెంపుడు కుక్క ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందని భావించినప్పటికీ, ఆ మార్గంలో కూడా స్పష్టమైన సమాచారం దొరకకపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది.
మరోవైపు విజయవాడలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) వ్యవహారం ఇంకా అనేక అనుమానాలకు కేంద్రబిందువుగానే ఉంది. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో అతను అదృశ్యమయ్యాడని, అనంతరం అతనికి ఏమైందన్న విషయంలో కుటుంబ సభ్యులు పోలీస్ వారిపైనే పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్పష్టత ఇవ్వడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచరాం జరుగుతునట్టుగా సాయికృష్ణ చనిపోయి ఉంటే ఆ మృతదేహం ఆచూకీపై ఇప్పటికీ అనేక సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ మూడు ఘటనల్లోనూ స్పష్టమైన ఫలితాలు లేకపోవడం ప్రభుత్వ పనితీరుపై విమర్శలకు దారితీస్తోంది. ప్రజల భద్రత, దర్యాప్తు సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ కేసులను ఛేదించడం ప్రభుత్వానికి, ముఖ్యంగా హోంశాఖకు కీలక పరీక్షగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిస్ అయిన వారి ఆచూకీని కనుగొని ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని వారు సూచిస్తున్నారు.






