సుగాలీ ప్రీతి కేసు (Sugali Preethi Case) విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు (Promises) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అధికారంలోకి వస్తే సుగాలీ ప్రీతి కేసును తొలి ప్రాధాన్యంగా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఎన్నికల అనంతరం ఆ అంశంపై ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా కేసులో ఉన్న కీలక సాక్ష్యాలు గత వైసీపి పాలనలో (YSRCP Government) తారుమారు చేశారు అంటూ చేసిన వాఖ్యలకు తీవ్ర దుమారమే రేపాయి.
అయితే సుగాలీ ప్రీతి తల్లి పార్వతి చేసిన వాఖ్యలు పవన్ కళ్యాణ్ ను మరింత ఇరుకున పెట్టాయి. కేసులో సాక్ష్యాలను జగన్ ప్రభుత్వ హయాంలో కాకుండా 2014–19 మధ్య టీడీపీ పాలనలోనే (TDP Government) తారుమారు చేశారని తాను స్వయంగా పవన్ కళ్యాణ్‌కు వివరించానని, అప్పట్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే న్యాయం కోరుతున్నందుకు తనపై జనసేన(Jana Sena) కార్యకర్తల ద్వారా ఒత్తిళ్లు, దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
పార్వతి (Parvathi) వ్యాఖ్యల నేపథ్యంలో సుగాలీ ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో చేసిన హామీలకు అనుగుణంగా ఇప్పటికీ స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిణామాలు జనసేన పార్టీ ప్రతిష్ఠపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను నిజాయితీ, నిబద్ధతకు ప్రతీకగా భావించిన యువతలో ఈ అంశంపై పునరాలోచన మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.






