విశాఖ (Visakhapatnam) జిల్లా పరవాడ (Parawada) జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) ఫార్మాసిటీలో (Pharma City) మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ (Dakshin Energy) పరిశ్రమలో తెల్లవారుజామున భారీ పేలుడు (Massive Explosion) సంభవించి, మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మృతి చెందిన వారిని వెంకటేశ్(Venkatesh), త్రినాథ్‌లుగా (Trinath) గుర్తించారు. వీరు అచ్యుతాపురం (Achyutapuram) ప్రాంతానికి చెందినవారిగా సమాచారం. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, మరికొందరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఘటన నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల (Safety Standards) అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సకాలంలో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీంతో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం ఘటన జరిగిన కొన్ని రోజులు స్పందించి, అనంతరం భద్రతా అంశాలను పూర్తిగా విస్మరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గతంలో అనకాపల్లి (Anakapalli) జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లారస్ ఫార్మా (Laurus Pharma) సంస్థలో జరిగిన ప్రమాదం సందర్భంగా పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పూర్తిగా మరిచిపోయారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకించి 2024 ఆగస్టులో అచ్యుతాపురం సెజ్‌లోని (SEZ) ఎసెన్షియా కంపెనీలో (Essencia Company) జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), పరిశ్రమల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు (Safety Audits) నిర్వహించాలని తాను గతంలోనే పలుమార్లు సూచించానని, కార్మికుల ప్రాణ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెప్టెంబర్‌లో విశాఖలో పరిశ్రమల భద్రతపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, మూడు నెలల్లో సమగ్ర కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే ఆ హామీలు అమలులోకి వచ్చాయా అనే ప్రశ్న ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్‌లో (Visakhapatnam Steel Plant) జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఘటనాస్థలాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు పరవాడ ఫార్మా కంపెనీల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ ప్రకటనలు కూడా ఆ రోజుకే పరిమితమయ్యాయా అనే సందేహాలు కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
తాజాగా దక్షిణ్ ఎనర్జీ (Dakshin Energy) పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనతో కార్మిక భద్రతపై ప్రభుత్వ వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ హామీలు ఇవ్వడం, అనంతరం వాటి అమలుపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల్లో సమగ్ర సేఫ్టీ ఆడిట్లు, కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయకపోతే మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.






