ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) పోలీసు శాఖపై (Police Department) వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ప్రజల విశ్వాసాన్ని పొందిన పోలీసు వ్యవస్థ, ఇప్పుడు ఆరోపణలు, అక్రమాలు(Illegal Activities, కస్టోడియల్ హింస(Custodial Violence, లైంగిక వేధింపులు (Sexual Harassment), అవినీతి కేసులతో (Corruption Case) వార్తల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన వ్యవస్థపై ప్రజల్లోనే అనుమానాలు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అక్రమ నిర్బంధాలు, వివాదాస్పద అరెస్టులు, పోలీస్ స్టేషన్లలో హింస వంటి ఆరోపణలు పెరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసు శాఖ ప్రతిష్ఠ ఇప్పుడు వరుస ఘటనలతో దెబ్బతింటోందనే చర్చ రాజకీయ, సామాజిక వర్గాల్లో జరుగుతోంది.
ఇటీవల పల్నాడు జిల్లాలో మాజీ సీఐ చిన్నమల్లయ్యపై నమోదైన అత్యాచార ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. లీజుకు తీసుకున్న కోళ్ల ఫారం వ్యవహారంలో డబ్బుల కోసం వచ్చిన సమయంలో తనపై లైంగిక దాడి చేశాడని ఓ మహిళ(Women) చేసిన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపింది. విచారణ అనంతరం చిన్నమల్లయ్యపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ పోలీసు శాఖ ఆయనను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం గమనార్హం. ఈ ఘటన పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తింది.
అదే జిల్లాలో మాచర్ల (Macherla) టౌన్ సీఐగా పనిచేసిన తురకా వెంకటరమణ (Turaka Venkataramana) వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. యువతి చౌడేశ్వరి (Chowdeswari) పరువు హత్య కేసులో ఆయన పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మేజర్ అయిన యువతిని తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు ఒత్తిడి చేయడం, ఇందుకు భారీ మొత్తంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు కేసును మరింత సంక్లిష్టం చేశాయి. అనంతరం హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరగడంతో సస్పెన్షన్ వేటు పడింది. స్థానికులు ఈ వ్యవహారాన్ని పోలీసు వ్యవస్థ వైఫల్యానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు.
మాచర్లలోనే మరో పోలీసు అధికారి ఏఎస్ఐ (ASI) శ్రీనివాసరావు (Srinivasa Rao) ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో వీడియోలు చిత్రీకరించి వాటితో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశారని, కొందరు మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆధారాలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించి ఆయనను సస్పెండ్ (Suspended) చేశారు. గతంలో కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయనే సమాచారం వెలుగులోకి రావడం పోలీసు వ్యవస్థలో పర్యవేక్షణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు పోలీసు శాఖను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ కేసులో సీఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు సహా పలువురు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. నలుగురిని సర్వీసు నుంచి తొలగించగా, మరికొందరిని సస్పెండ్ చేశారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పోలీసు సిబ్బంది పాత్రపై లభించిన ఆధారాలు ఈ కేసును రాష్ట్రంలో అత్యంత సంచలనాత్మక పోలీసు కుంభకోణాల్లో ఒకటిగా నిలిపాయి.
ఇక విజయవాడలో గాదె సాయికృష్ణ కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్న యువకుడు పోలీసు కస్టడీలో హింసకు గురై మరణించాడనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అనంతరం ఆధారాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. ప్రతిపక్షాల ఒత్తిడి, ప్రజా ఆందోళనల నేపథ్యంలో కేసు నమోదు చేసి సంబంధిత అధికారిపై సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో మరికొందరు పోలీసు అధికారులు, ఉన్నతాధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
ఈ ఘటనలను పరిశీలిస్తే, సమస్య వ్యక్తిగత అధికారుల ప్రవర్తనకే పరిమితం కాకుండా వ్యవస్థాగత వైఫల్యాల వైపు చూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రమశిక్షణ, బాధ్యతాయుత పాలన, రాజకీయ జోక్యం వంటి అంశాలపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. ఒకప్పుడు ప్రజల భద్రతకు ప్రతీకగా నిలిచిన పోలీసు వ్యవస్థపై నేడు అనుమానాలు పెరగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకర సంకేతంగా పలువురు పేర్కొంటున్నారు.
ప్రత్యేకించి హోంశాఖ మంత్రి అనిత పనితీరు, వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు కేవలం వ్యక్తుల తప్పిదాలా? లేక పోలీసు వ్యవస్థలో లోతైన సంక్షోభానికి సంకేతమా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.





