భారత క్రికెట్ (Indian Cricket) చరిత్రను (History శాశ్వతంగా మార్చిన 1983 ప్రపంచకప్ (1983 World Cup) విజయానికి నేటితో 43 ఏళ్లు (43 Years) పూర్తయ్యాయి. 1983 జూన్ 25న సాధించిన ఆ అద్భుత విజయం భారత క్రికెట్‌కు కొత్త దిశను చూపడమే కాకుండా, కోట్లాది మంది యువ క్రికెటర్లకు (Young Cricketers) స్ఫూర్తిగా నిలిచింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆ చిరస్మరణీయ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేసింది. “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం” అంటూ కపిల్ దేవ్ (Kapil Dev) సారథ్యంలో ప్రపంచకప్ గెలిచిన జట్టుకు సోషల్ మీడియా వేదికగా ఘనంగా నివాళులు అర్పించింది.
1983 జూన్ 25న లండన్‌లోని (London) లార్డ్స్ మైదానంలో (Lord’s Cricket Ground) జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్, అప్పటివరకు వరుసగా 2 సార్లు ప్రపంచకప్ గెలిచిన బలమైన వెస్టిండీస్ జట్టును (West Indies Team) ఎదుర్కొంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. కృష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో అత్యధిక స్కోరు నమోదు చేయగా, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. వెస్టిండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ 3 వికెట్లు పడగొట్టగా, మాల్కమ్ మార్షల్, మైఖేల్ హోల్డింగ్, లారీ గోమ్స్ తలో 2 వికెట్లు సాధించి భారత జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
184 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. అయితే భారత బౌలర్లు, ఫీల్డర్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. ఆరంభంలోనే కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచిన భారత జట్టు, క్రమంగా మ్యాచ్‌ను తన వైపు తిప్పుకుంది. వెస్టిండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 43 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించి తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
ఈ చారిత్రక ఫైనల్లో 26 పరుగులు చేయడంతో పాటు 3 కీలక వికెట్లు పడగొట్టిన మొహిందర్ అమర్నాథ్కు (Mohinder Amarnath) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ ప్రపంచకప్ ట్రోఫీని (World Cup Trophy) ఎత్తిపట్టిన దృశ్యం భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ విజయం భారత క్రికెట్‌కు కొత్త యుగానికి శ్రీకారం చుట్టడమే కాకుండా, ప్రపంచ క్రికెట్లో భారత ఆధిపత్యానికి బలమైన పునాది వేసిందని ఇప్పటికీ అభిమానులు గర్వంగా గుర్తుచేసుకుంటుంటారు.






