రాజధాని నిర్మాణం (Capital Construction) కోసం భూములు (Lands) ఇచ్చిన రైతుల హక్కులు (Farmers Rights), వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, భూ సమీకరణకు సంబంధించిన తాజా పరిణామాలపై రాజధాని ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన సీఆర్డీఏ (CRDA) రైతు పరిరక్షణ కమిటీ (Farmer Protection Committee) సభ్యులపై పెనుమాకలో జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు పరిరక్షణ కమిటీ స్పష్టం చేస్తోంది. రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో తమ భూములను అప్పగించారని, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం (Government) ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలని కమిటీ డిమాండ్ చేస్తోంది.
రాజధాని ప్రాంత రైతులకు ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అభివృద్ధి చేసిన రీ-కాన్స్టిట్యూటెడ్ ప్లాట్లను (Reconstituted Plots) దామాషా ప్రకారం కేటాయించాలని కమిటీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల నుంచి మరోసారి భూ సమీకరణ పేరుతో భూములు తీసుకునే ప్రయత్నాలు చేయడం అన్యాయమని కూడా కమిటీ పేర్కొంటోంది.
అంతేకాకుండా, ప్రస్తుతం కోర్టుల విచారణలో ఉన్న అంశాలపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా న్యాయ ప్రక్రియను గౌరవించాలని, రైతుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని కమిటీ కోరుతోంది. రైతులతో చర్చలు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతోంది.
రైతుల ఫిర్యాదుల మేరకు నిడమర్రు(Nidamarru),, పెనుమాక (Penumaka) గ్రామాల్లో పర్యటించి, రైతులు(Farmers) ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి తదుపరి కార్యాచరణ రూపొందించాలని సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించి, అవసరమైన న్యాయపరమైన, రాజకీయ, ప్రజా ఉద్యమ కార్యక్రమాలను చేపట్టేందుకు కూడా కమిటీ ఏర్పాటైంది.
ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పెనుమాక గ్రామానికి చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులను కలిసేందుకు వెళ్లిన కమిటీ సభ్యులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి కమిటీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయని, అనేక వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించాల్సి వచ్చింది. ఇటీవల భూములివ్వని రైతుల పొలాల్లోకి అధికారులు నీటిని వదిలారని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకే రైతు పరిరక్షణ కమిటీ గ్రామాలకు వెళ్లిందని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.
రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి వెళ్లిన కమిటీపై భౌతిక దాడులు జరగడం రాజధాని గ్రామాల్లో ఆందోళనకు దారితీసిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలు ప్రజలకు తెలియకుండా అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయనే అభిప్రాయం రాజధాని ప్రాంత రైతుల్లో వ్యక్తమవుతోందని వారు పేర్కొంటున్నారు.
ఈ ఘటనతో రాజధాని ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. రైతుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ చర్యలు, భూ సమీకరణ విధానంపై చర్చ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది.






