ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన విధానం అమలు దశలో ఉండగానే, తాజాగా రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో కూడా వైన్ షాపులు, బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, తిరుపతి విమానాశ్రయం మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని ఎయిర్‌పోర్టుల్లో మద్యం విక్రయాలకు అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా, విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే వైన్ షాపులు, బార్లకు 24 గంటలపాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన లైసెన్స్ ఫీజులు, ఎక్సైజ్ పన్నులపై కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుమును రూ.5 లక్షలు, వైన్ షాపుల దరఖాస్తు రుసుమును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. విమానాశ్రయాల్లోని వైన్ షాపులకు రూ.1 కోటి ఎక్సైజ్ ట్యాక్స్ విధించనుండగా, వార్షికంగా 20 లక్షలకు పైగా ప్రయాణికుల రద్దీ ఉన్న ఎయిర్‌పోర్టుల్లో బార్లకు రూ.25 లక్షలు, అంతకంటే తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాల్లో రూ.15 లక్షలు ఎక్సైజ్ ట్యాక్స్‌గా నిర్ణయించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ వైన్ షాపులు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల్లో కూడా మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో విమానాశ్రయాల్లో వైన్ షాపులు, బార్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






