ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని (Capital) అంశం రాష్ట్ర విభజన తర్వాత అత్యంత వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది. అయితే ఈ వివాదానికి అసలు కారణం ఎవరు? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నిజంగానే తన మాటలను మార్చారా? లేక ఆయన వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించారా? అనే ప్రశ్నలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 2014లో తెలుగుదేశం పార్టీ(TDP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అంశాన్ని కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా, ఒక దీర్ఘకాల రాజకీయ ప్రచారంగా మలిచినట్లు కనిపిస్తోందని అంటున్నారు.
రాజధాని ఎంపిక నుంచే మొదలైన వివాదం
2014లో రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ (Sivaramakrishnan Committee) వికేంద్రీకృత అభివృద్ధిని సూచిస్తూ ఒకే ప్రాంతంలో భారీ రాజధాని(Capital) నిర్మాణం రాష్ట్రానికి ఆర్థికంగా భారమవుతుందని నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదికను పక్కనపెట్టి సొంత నిర్ణయం దిశగా అడుగులు వేసింది నాటి ప్రభుత్వం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా, విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం సాధించకుండా రాజధాని నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ అంశం దశాబ్దకాలంగా వివాదాస్పదంగా కొనసాగుతోందని చెబుతున్నారు.
జగన్ అసెంబ్లీలో అమరావతిని ఒప్పుకుని తరువాత మాట మార్చారా?
ఇది తెలుగుదేశం పార్టీ(TDP) తరచూ చేసే ప్రధాన విమర్శల్లో ఒకటి. అయితే అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే అసల నిజం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీలో మాట్లాడిన జగన్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. అయితే అదే సమయంలో ఒక కీలక షరతును కూడా స్పష్టంగా పేర్కొన్నారు. 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలోనే రాజధాని నిర్మించాలని సూచించారు.
ఆ సమయంలో ప్రభుత్వం 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల భూములను సేకరించే ప్రణాళికను ప్రకటించలేదు. అమరావతి అనే ఊసే నాటికి లేదు. ఆ తరువాత ల్యాండ్ పూలింగ్ (Land Pooling) విధానం ప్రకటించినప్పటి నుంచే జగన్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. సీఆర్డీఏ బిల్లుపై(CRDA Bill) జరిగిన చర్చలో కూడా రైతుల భూములను తీసుకుని భారీ రియల్ ఎస్టేట్ నమూనాలో రాజధాని నిర్మించడం సరైన విధానం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్ల ఆయన రాజధాని పేరున ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకించారని విశ్లేషకులు గుర్తు చెస్తున్నారు.
మాటలు మార్చింది జగన్ కాదు… తెలుగుదేశమేనా?
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాజధాని విషయంలో కాలక్రమేణా ఎక్కువ మాటలు మార్చింది తెలుగుదేశం పార్టీనే అనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రారంభంలో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అన్నారు. తరువాత రైతుల భూములతో ల్యాండ్ పూలింగ్ (Land Pooling) మోడల్ తీసుకొచ్చారు. అనంతరం సింగపూర్ తరహా ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తామని ప్రకటించారు. తర్వాత రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలకుపైగా అవసరమని చెప్పారు. తరువాత అది సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ (Self-Sustaining Project) అని వివరించారు. అనంతరం 50 వేల ఎకరాలు సరిపోవని, మరో 50 వేల ఎకరాలు అవసరమని ప్రకటించారు. ఈ మాటల్లో వచ్చిన మార్పులు చూపిస్తూ, రాజధాని నమూనాపై స్పష్టత మార్చింది జగన్ కాదు, అప్పటి ప్రభుత్వమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతిలో ఇల్లు కట్టుకుని మూడు రాజధానులు ఎందుకు అనే విమర్శ?
జగన్ అమరావతి ప్రాంతంలో స్వయంగా నివాసం నిర్మించుకోవడం ద్వారా ఆ ప్రాంతంపై తనకు వ్యతిరేకత లేదని చూపించారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలో కూడా అమరావతిని పూర్తిగా తొలగించలేదు. శాసన రాజధానిగా కొనసాగించాలని ప్రతిపాదించారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదించారు. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం అమరావతిని వ్యతిరేకించడం కాదని, హైదరాబాద్ తరహాలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ఒకే నగరంలో కేంద్రీకరించకుండా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధిని సాధించడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ వచ్చింది. నిజానికి శివరామకృష్ణ కమిటీ నివేదిక కూడా ఇదే తరహాలో రాజధాని ఉండాలని ప్రతిపాదించింది.
రాజధాని రైతులపై కక్ష సాదించారు జగన్ అంటూ ప్రచారం?
ఈ విమర్శ కూడా తరచూ వినిపిస్తుంది. అయితే జగన్ ప్రభుత్వం రాజధాని రైతులకు(Farmers) ఇచ్చే వార్షిక కౌలు మొత్తాన్ని పెంచింది. రాజధానిలో భూములు ఇచ్చిన కౌలు రైతులకు, భూ యజమానులకు చెల్లించే కౌలు కాలాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారు. వార్షిక కౌలును సైతం గతంలో ఎకరానికి రూ.2,500 నుంచి రూ.5,000 వరకు ప్రభుత్వం పెంచింది. అభివృద్ధి చేసిన ప్లాట్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మూడు రాజధానుల చట్టంపై న్యాయపరమైన వివాదాలు, కోర్టుల స్టేటస్ కో ఆదేశాల కారణంగా పనులు నిలిచిపోయాయని గుర్తు చేస్తున్నారు.
మూడు రాజధానులు… మాట తప్పడమా? లేక వికేంద్రీకరణా?
2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఒకే నగరంపై మొత్తం పెట్టుబడులు కేంద్రీకరించడం భవిష్యత్తులో మరో ప్రమాదంగా మారవచ్చనే అభిప్రాయంతోనే ఈ విధానం తీసుకువచ్చినట్లు ఆ పార్టీ వివరిస్తోంది. అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు సూచించిన నేపథ్యంలో, తక్కువ వ్యయంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఆర్థికంగా సమంజసమని నాటి ప్రభుత్వం భావించింది. ఇదే నిపుణుల కమిటీ సైతం చెప్పింది.
జగన్ పాలనలో విశాఖ, కర్నూల్లో ఒక్క ఇటుక కూడా ఎందుకు పడలేదు అంటూ విమర్శలు?
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, మూడు రాజధానుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించాయి. కోర్టుల స్టేటస్ కో ఆదేశాల కారణంగా రాజధానికి సంబంధించిన కొత్త నిర్మాణాలు ముందుకు సాగలేదనేది నిజం. ప్రభుత్వం పనులు చేయలేదని కాకుండా, న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడటమే ప్రధాన కారణమని జరిగిన పరిణామాలు చూస్తే అర్ధం చేసుకోవచ్చు.
మావిగన్… కొత్త నినాదమా? లేక కొత్త అభివృద్ధి నమూనానా?
ఇటీవల జగన్ ప్రస్తావించిన “మావిగన్”(MAVIGUN) (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) నమూనా కూడా పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మూడు రాజధానుల అంశం న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న తర్వాత, పార్లమెంట్ లో అమరావతి బిల్ పాస్ అయిన నేపధ్యంలో , ఆ బిల్లుని గౌరవిస్తూనే సీఆర్డీఏ పరిధిలోనే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా మావిగన్ ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరాలను అనుసంధానిస్తూ ఒక భారీ ఆర్థిక కారిడార్‌ను నిర్మించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని ఈ నమూనా ప్రతిపాదిస్తోంది.
అమరావతి నిర్మాణానికి అవసరమని అంచనా వేసిన భారీ వ్యయంలో సుమారు 10 శాతం వ్యయంతోనే మావిగన్ కారిడార్‌ను అభివృద్ధి చేయవచ్చని ఆర్థిక వర్గాలు చర్చిస్తున్నాయి. అంతేకాకుండా ఇది కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం కారిడార్ పరిధిలోని వందలాది గ్రామాలకు అభివృద్ధి అవకాశాలను తీసుకువస్తుందని ఈ నమూనా అనుకూల వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోని బోష్-వాష్, చైనాలోని జింగ్-జిన్-జీ, వంటి మెగా-రీజియన్ నమూనాలతో దీనిని పోలుస్తున్నారు.
మావిగన్ నమూనాతో రాయలసీమ, ఉత్తరాంధ్రకు వెన్నుపోటు అంటూ విమర్శలు?
మావిగన్ ప్రకటించడంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జగన్ అన్యాయం చేశారనే విమర్శలు కూడా తెలుగుదేశం నుండి రావడం ఒక విచిత్ర పరిణామంగా చెబుతున్నారు. అయితే మూడు రాజధానుల చట్టాన్ని కోర్టుల్లో సవాలు చేసి, విశాఖపట్నం, కర్నూలులో రాజధాని ఏర్పాటుకు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించింది తెలుగుదేశం పార్టీనే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఒకవేళ నిజంగానే ఆ ప్రాంతాల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉండి ఉంటే, స్టేటస్ కో ఉత్తర్వులను కొనసాగనివ్వకుండా టీడీపీ నాడు మూడు రాజధానులకి రాజకీయంగా మద్దతు ఇచ్చి ఉండాల్సిందని ఆ పార్టీ వాదిస్తోంది.
రాజధాని అంశాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ వైఖరి ప్రారంభం నుంచి రెండు ప్రధాన అంశాల చుట్టూనే తిరిగిందని వారు చెబుతున్నారు—రైతుల భూములను భారీ స్థాయిలో సేకరించే ల్యాండ్ పూలింగ్ విధానానికి వ్యతిరేకత, రాష్ట్రంపై అధిక ఆర్థిక భారం మోపకుండా అభివృద్ధి సాధించాలనే లక్ష్యం.
మరోవైపు, ఆయన చేసిన వ్యాఖ్యలను సందర్భానికి భిన్నంగా చూపిస్తూ రాజకీయ ప్రచారం జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో రాజధాని అంశంపై వచ్చిన వివిధ నిర్ణయాలు, న్యాయపరమైన పరిణామాలు, రాజకీయ వ్యూహాలు కలిసి ఈ సమస్యను తెలుగుదేశం పార్టీనే దశాబ్దకాలంగా కొనసాగించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.






