థాయ్‌లాండ్‌లో (Thailand) హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేవలం 11 ఏళ్ల బాలుడు (11-year-Old Boy) నడిపిన పికప్ ట్రక్ (Pickup Truck) బౌద్ధ సన్యాసుల (Buddhist Monks) బృందంపైకి అదుపుతప్పి దూసుకెళ్లడంతో 9 మంది సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపగా, ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో మరో 20 మందికి పైగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విషాదకర ఘటన థాయ్‌లాండ్ ఈశాన్య ప్రాంతంలోని ముక్దహాన్ ప్రావిన్స్‌లో (Mukdahan Province) జరిగింది. అధికారుల వివరాల ప్రకారం, మొత్తం 35 మంది బౌద్ధ సన్యాసులు, 5 మంది అనుచరులతో కూడిన బృందం పాదయాత్రలో భాగంగా ఒక ఆలయం నుంచి ఉబోన్ రాచతాని ప్రావిన్స్‌లోని (Ubon Ratchathani Province) మరో ఆలయానికి బయలుదేరింది. యాత్ర ప్రారంభమైన సుమారు 30 నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
సన్యాసుల బృందం రహదారి(Road) పక్కన వరుసగా నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే 5 మంది సన్యాసులు మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన మరో 4 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 9కు చేరుకుంది. మరో 22 మంది సన్యాసులు, 1 అనుచరుడు గాయపడగా, వారిలో 4 మంది సన్యాసుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 11 ఏళ్ల బాలుడు తన ఇంటి వద్ద ఉన్న పికప్ ట్రక్‌ను కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తీసుకెళ్లినట్లు గుర్తించారు. సుమారు 10 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సన్యాసుల బృందాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం తర్వాత బాలుడు తీవ్ర మానసిక షాక్‌కు గురికావడంతో వెంటనే విచారణ చేపట్టలేకపోయామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు(Police), బాలల సంక్షేమ అధికారుల (Child Welfare Officials) పర్యవేక్షణలో విచారణ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో రహదారి పక్కన ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న సన్యాసుల బృందంపైకి పికప్ ట్రక్ ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చిన్నారులకు వాహనాలు అప్పగించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.







