చైనా ఆర్థిక వ్యవస్థపై (China Economic System) ప్రభుత్వ గణాంకాలను బహిరంగంగా ప్రశ్నించిన ప్రముఖ ఆర్థికవేత్త గావో షాన్వెల్ (Gao Shanwen) (55) అనుమానాస్పదంగా మరణించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యంతో మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించినప్పటికీ, ఈ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్టుబడి సంస్థ ఎస్‌డీఐసీ సెక్యూరిటీస్‌లో (SDIC Securities) ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన గావో(Gao)… దేశ ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ధైర్యంగా వెల్లడించే నిపుణుడిగా గుర్తింపు పొందారు.
2024లో అమెరికాలోని(USA) వాషింగ్టన్‌లో (Washington) జరిగిన ఓ కార్యక్రమంలో గావో చేసిన వ్యాఖ్యలు చైనాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. గత 2 నుంచి 3 సంవత్సరాలుగా చైనా వాస్తవ జీడీపీ వృద్ధిరేటు (GDP Growth Rate) సగటున కేవలం 2 శాతం (2 Percent) మాత్రమే ఉందని, ప్రభుత్వం ప్రకటిస్తున్న 5 శాతం వృద్ధి వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నమని ఆయన వెల్లడించారు. వినియోగం, ఉపాధి, రియల్ ఎస్టేట్ రంగాల్లో కొనసాగుతున్న బలహీనతలను కూడా ఆయన స్పష్టంగా ప్రస్తావించారు.
ఈ వ్యాఖ్యల తర్వాత గావోపై చైనా ప్రభుత్వం (Chinese Government) కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆయన బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించడంతో పాటు సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. హాంకాంగ్‌లో (Hong Kong) పెట్టుబడి సలహాదారుగా కొనసాగేందుకు అవసరమైన లైసెన్స్ గడువు కూడా ముగిసింది.
గావో మరణానికి అనారోగ్యమే కారణమని చైనా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆయన మరణించిన సమయం, అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు 2025 ప్రారంభంలో గావోకు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ఆయన సన్నిహితులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఆయన మరణంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గావో మరణం అనంతరం చైనీస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నివాళులు వెల్లువెత్తుతున్నాయి. “నిజం మాట్లాడిన ఆర్థికవేత్త”, “వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన నిపుణుడు” అంటూ పలువురు పోస్టులు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
చైనా కమ్యూనిస్ట్ (China Communist) ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోందన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. కోవిడ్-19 ప్రమాదంపై ముందుగానే హెచ్చరించిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వ్యాపారవేత్త జాక్ మా వంటి ప్రముఖులపై కూడా చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు గావో షాన్వెల్ హఠాన్మరణం కూడా అదే తరహా అనుమానాలు, చర్చలకు దారితీస్తోంది.








