---Advertisement---

ఐదోసారి అరెస్టుపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రశ్న రావణ్

July 4, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వరుస అరెస్టులతో వార్తల్లో నిలుస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prashna Ravana) మరోసారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా నాలుగు కేసుల్లో కోర్టుల నుంచి బెయిల్(Bail) పొందిన అనంతరం కూడా ఐదోసారి అరెస్టు కావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కోర్టులో బెయిల్ లభించి విడుదలైన కొద్దిసేపటికే, వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు ఆయనను మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అనంతరం విడుదల చేసిన వీడియోలో ప్రశ్న రావణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ చర్యలపై నిప్పులు చెరిగారు. “మీరు నన్ను చంపితే నేను ఒక్కడినే చచ్చిపోతా… కానీ ప్రశ్నించే వాళ్లు (Questioning Voices) ఎప్పటికీ చావరు. మీరు రావణ్ గాడిని మాత్రమే చంపగలరు, నా ప్రశ్నను మాత్రం చంపలేరు” అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి వందలాది మంది పోలీసులను వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన విమర్శించారు. ఎస్పీ స్థాయి అధికారుల నుంచి కానిస్టేబుళ్ల (Constables) వరకు తన వెంట తిరగడం బాధాకరమని, ప్రజల సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తనపై కేంద్రీకృతం కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి హింసకు పాల్పడలేదని, కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) ప్రశ్నించినందుకే తనపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్(Nara Lokesh), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను(Pawan Kalyan) ఉద్దేశించి మాట్లాడుతూ, “వ్యవస్థ మొత్తాన్ని ఒక్క వ్యక్తి కోసం ఉపయోగించడం ఎందుకు? డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌లోనే నన్ను చంపేయండి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా తాను అన్నం తినడం లేదని, కనీసం మంచినీళ్లు కూడా తాగడం లేదని ప్రశ్న రావణ్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని, అందుకే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర చరిత్రలో వరుసగా నాలుగు కేసుల్లో బెయిల్ పొంది, ఐదోసారి మళ్లీ అరెస్టు కావడం అరుదైన పరిణామమని ఆయన పేర్కొన్నారు. తనపై జరుగుతున్న వ్యవహారం ఒక “ఆర్గనైజ్డ్ క్రైమ్”(Organized Crime) లాంటిదని ఆరోపిస్తూ, జనసేన ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో తనపై దాడులకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నం, నక్కపల్లి కేసుల్లో కోర్టులు రిమాండ్‌ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, వెంటనే మరో కేసులో పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుస అరెస్టులు, బెయిల్లు, మళ్లీ కొత్త కేసుల్లో అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలపై పౌర సమాజంలోని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment