---Advertisement---

KTR: కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వం చేతకాకపోతే 7 రోజులు కేసీఆర్‌కు అప్పగించండి!

July 5, 2026

Summarize with AI

---Advertisement---

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విధించిన హౌస్ అరెస్టులు(House Arrests), పోలీసుల ఆంక్షలు, అడుగడుగునా ఎదురైన అడ్డంకులను దాటుకుని చివరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని (Jayashankar Bhupalpally) కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రయాణం పలుమార్లు పోలీసుల అడ్డంకుల కారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకు సాగిందని ఆయన విమర్శించారు. తాము రాజకీయ విమర్శల కోసం కాకుండా తెలంగాణ రైతులకు (Telangana Farmers) కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ప్రాముఖ్యతను వివరించేందుకే వచ్చామని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా నీటి కొరతతో ఇబ్బందులు పడిన తెలంగాణకు (Telangana) శాశ్వత పరిష్కారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుగా ఇది నిలిచిందని, పల్లం నుంచి 90 అడుగుల ఎత్తుకు నీటిని ఎత్తి పంపే సాంకేతిక సామర్థ్యాన్ని విజయవంతంగా నిరూపించిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ గతంలో తుమ్మిడిహట్టి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని, కేసీఆర్(KCR) జలదౌత్యంతో సమస్యలను పరిష్కరించి కేవలం 3.5 సంవత్సరాల్లో కన్నెపల్లి వద్ద భారీ ఎత్తిపోతల వ్యవస్థను నిర్మించారని తెలిపారు. 22 సంవత్సరాలుగా పోలవరం పూర్తికాకపోయినా కాళేశ్వరం (Kaleshwaram) పనులు అత్యంత వేగంగా పూర్తయ్యాయని చెప్పారు.

రూ.95 వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యం ఉండగా, 370కు పైగా పిల్లర్లు నిర్మించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే బ్లాక్‌లో 2 పిల్లర్లు కుంగిపోవడాన్ని ఆసరాగా తీసుకుని మొత్తం ప్రాజెక్టును “కూలేశ్వరం”గా ప్రచారం చేయడం రాజకీయ దుష్ప్రచారమేనని మండిపడ్డారు. దెబ్బతిన్న భాగాన్ని పునర్నిర్మించడానికి కేవలం రూ.400 కోట్లు సరిపోతాయని, నిర్మాణ సంస్థే ఆ వ్యయాన్ని భరిస్తామని చెప్పినా ప్రభుత్వం ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని ఆరోపించారు.

ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 100 మీటర్ల ఎత్తులో నీరు అందుబాటులో ఉండగా, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తేందుకు 93 మీటర్ల స్థాయి చాలని కేటీఆర్(KTR) తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం మోటార్లు ప్రారంభించకపోవడంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, రోజుకు సుమారు 15 వేల ట్యాంకర్లు తిరుగుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. కాళేశ్వరం అవసరం లేకుండానే రికార్డు పంటలు పండాయని చెప్పే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014కు ముందు ఎందుకు అలాంటి దిగుబడులు నమోదు కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) ప్రమాదంలో తాము అవినీతి ఆరోపణలు చేయలేదని, కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్(KTR) విమర్శించారు. రైతులకు సాగునీరు అందిస్తే యూరియా, ధాన్యం కొనుగోలు భారం పడుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు.

కాళేశ్వరం తెలంగాణకు కేసీఆర్ అందించిన గొప్ప వరమని పేర్కొన్న కేటీఆర్, ప్రభుత్వం చేతకాకపోతే ప్రాజెక్టును 7 రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగించాలని, కేవలం 7 రోజుల్లోనే నీటిని ఎత్తి చూపిస్తామని సవాల్ విసిరారు. ప్రభుత్వం వెంటనే మోటార్లు ప్రారంభించాలని, లేకపోతే 50 వేల మంది కార్యకర్తలతో కాళేశ్వరం ప్రాజెక్టును ముట్టడించి తామే మోటార్లు ప్రారంభిస్తామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment