స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) వ్యవహారశైలిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఆమె లేఖ రాస్తూ పలువురు అధికారుల సమక్షంలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ (Endowments Department) మంత్రిగా తనను, తన కార్యాలయాన్ని పూర్తిగా పక్కనపెట్టి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కమిషనర్ కార్యాలయంలో అధికారిక సమీక్షా సమావేశం (Official Review Meeting) నిర్వహించడం ప్రభుత్వ వ్యవస్థకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
దేవాదాయ శాఖకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లు, శాఖాపరమైన నివేదికలు, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటి అంశాలు మంత్రి అధికార పరిధిలోకి వస్తాయని కొండా సురేఖ స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే(MLA) నేరుగా శాఖ అధికారులను సమావేశానికి పిలిచి సమీక్ష నిర్వహించడం, ఆదేశాలు జారీ చేయడం ఎలా సమంజసమవుతుందని ఆమె ప్రశ్నించారు.
కడియం శ్రీహరి వ్యవహారం కేవలం పరిపాలనా లోపంగా మాత్రమే చూడలేమని, ఇది ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది పలికే చర్యగా భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. శాఖా మంత్రిగా తన అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నమే ఈ చర్య వెనుక ఉందని ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు (Undivided Warangal District) చెందిన పలువురు నాయకులను రెచ్చగొట్టి తనపై కడియం శ్రీహరి దుష్ప్రచారం చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ప్రస్తుతం కూడా ఉద్దేశపూర్వకంగానే తనను విస్మరిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, దీని వల్ల దేవాదాయ శాఖ అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయం నెలకొన్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలను, శాఖా మంత్రి అధికారాలను అతిక్రమించిన కడియం శ్రీహరిపై పార్టీ క్రమశిక్షణా కమిటీ (Disciplinary Committee) ద్వారా విచారణ జరిపించాలని కొండా సురేఖ తన లేఖలో కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె విజ్ఞప్తి చేశారు.







