విద్య(Education) అనేది ఏ రాష్ట్రానికైనా భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన సాధనం. ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు, కానీ విద్యా వ్యవస్థ (Education System) బలహీనపడితే దాని ప్రభావం తరాలపాటు ఉంటుంది. అందుకే పాఠశాల విద్యకు సంబంధించిన ప్రతి గణాంకం ఒక సమాజం ఏ దిశగా ప్రయాణిస్తుందో తెలిపే సూచికగా చెబుతారు.
అయితే తాజాగా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడైస్ ప్లస్ నివేదికలు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పాఠశాల విద్యా (School Education) రంగంలో గత మూడు విద్యా సంవత్సరాల (2023–24 నుంచి 2025–26 వరకు) పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్ర విద్యా వ్యవస్థ నిజంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందా? లేక క్రమంగా సంక్షోభం వైపు జారుతోందా అనే అనుమానం కలగక మానదు.
మొదటగా ఆందోళన కలిగించే అంశం చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల(Students) నమోదు తగ్గుదల. 2023–24లో 87.42 లక్షలుగా ఉన్న మొత్తం నమోదు, 2025–26 నాటికి 84.37 లక్షలకు తగ్గింది, సుమారు 3 లక్షల మంది తగ్గారు. ఇదే కాలంలో పాఠశాలల సంఖ్య కూడా 61,373 నుంచి 60,843కు పడిపోయింది, 530 పాఠశాలలు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలపై (Government Schools) ప్రజల విశ్వాసం తగ్గుతోందనే అభిప్రాయం ఈ గణాంకాలు చెబుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నమాట.
విద్యార్థుల నమోదు తగ్గడానికి కారణాలు చూస్తే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్(Nara Lokesh) పేలవమైన పనితీరే కారణంగా చెబుతున్నారు. విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, కోతలు, విద్యా కానుక (Vidya Kanuka) వంటి కార్యక్రమాల నిర్వహణలో జాప్యం, మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal Scheme) నాన్యతపై వచ్చిన విమర్శలు, కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) ఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచాయని, ఈ పేలవమైన పనితీరే పిల్లలు పాఠశాలలకి దూరంగా జరుగుతున్నట్టు కనిపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
ఇక మరింత ఆందోళన కలిగించే విషయం ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరగడం. 2023–24లో 12,611గా ఉన్న ఈ పాఠశాలలు 2025–26 నాటికి 16,357కు చేరుకున్నాయి. రెండు లక్షలకుపైగా విద్యార్థులు ఒకే ఉపాధ్యాయుడిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌలిక సదుపాయాల పరిస్థితి కూడా ఆశాజనకంగా కనిపించడం లేదు. వేలాది డిజిటల్ లైబ్రరీలు (Digital Libraries) లేకపోగా గత ప్రభుత్వం కన్నా తగ్గుదల చూస్తే మరింత ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. బాలికలు, బాలుర కోసం అవసరమైన మరుగుదొడ్లు కూడా అన్ని పాఠశాలల్లో అందుబాటులో లేవు. సోలార్ ప్యానెల్లు ఉన్న పాఠశాలల సంఖ్య కూడా తగ్గడం నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సూచిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో అమలైన ‘నాడు-నేడు'(Nadu-Nedu) కార్యక్రమం నిలిచిపోవడం వల్ల పాఠశాలల అభివృద్ధి మందగించిందని విమర్శకులు అంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలలు కేవలం విద్యను అందించే సంస్థలు మాత్రమే కావు. అవి సామాజిక సమానత్వానికి పునాది. ప్రైవేట్ విద్యను భరించలేని లక్షలాది కుటుంబాలకు అవే ఆశాకిరణం. అలాంటి వ్యవస్థ బలహీనపడితే దాని భారాన్ని మోయాల్సింది అత్యంత బలహీన వర్గాలే. ఈ గణాంకాలు ప్రభుత్వానికే కాదు, సమాజానికీ హెచ్చరిక. విద్యలో వెనుకబడిన రాష్ట్రం, అభివృద్ధిలోనూ వెనుకబడుతుంది. అందుకే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను వెంటనే తీర్చడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడం అత్యవసరం.
విద్యపై పెట్టుబడి అంటే భవిష్యత్తుపై పెట్టుబడి. నేడు తీసుకునే నిర్ణయాలే రేపటి తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యను కాపాడే సంస్కరణలు చేపడతారా? లేక గణాంకాలు చెబుతున్న హెచ్చరికలను కూడా నిర్లక్ష్యం చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.







