వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదంపై తీవ్రంగా స్పందించారు. తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపిస్తూ సంచలన వీడియో విడుదల చేశారు.
నెల రోజులుగా తమ కుటుంబాన్ని సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల ద్వారా లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధిస్తున్నారని జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్, మేఘన మధ్య ఏర్పడిన మనస్పర్థలు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయని, అందువల్ల పూర్తి వివరాలు వెల్లడించలేనని స్పష్టం చేశారు.
మేఘన మతమార్పిడికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని, వ్యక్తిగత విశ్వాసాలను రాజకీయ ఆరోపణలకు ఉపయోగించడం సరికాదన్నారు.
టీడీపీ అనుకూల మీడియా తమ కుటుంబ సమస్యను రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపించారు. అలాగే, ఈ వ్యవహారం వెనుక రాజకీయ జోక్యం ఉందని పేర్కొంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయానికి మేఘన వెళ్లినట్లు చెబుతున్న వీడియోను కూడా విడుదల చేశారు.
తనపై రాజకీయ కక్షతోనే కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన జోగి రమేష్, “రాజకీయంగా నాపైకి రండి.. వ్యక్తిగత జీవితాల్లోకి రావద్దు” అంటూ చంద్రబాబు, నారా లోకేష్లకు సవాల్ విసిరారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో బయటపెడతానని తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.







