అమెరికా-ఇరాన్ (America-Iran) మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. వరుసగా రెండో రోజు కూడా అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులు (Airstrikes) కొనసాగించింది. ఈసారి ఇరాన్ మిలిటరీ స్థావరాలతో (Military Bases) పాటు చైనా-తుర్క్‌మెనిస్తాన్-ఇరాన్‌ను (China-Turkmenistan-Iran) కలిపే అత్యంత కీలక రైల్వే కారిడార్‌ను(Railway Corridor) లక్ష్యంగా చేసుకుని అమెరికా క్షిపణుల దాడి నిర్వహించింది. ఈ దాడితో అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గోలెస్తాన్ ప్రావిన్స్‌లో (Golestan Province) ఉన్న రైల్వే మార్గంలోని అత్యంత కీలక ఒగ్టే ఖాన్ వంతెనను (Oghte Khan Bridge) అమెరికా క్షిపణులతో ధ్వంసం చేసింది. ఈ రైల్వే ప్రాజెక్ట్ చైనా, తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్ దేశాలను అనుసంధానించే ప్రధాన వాణిజ్య మార్గంగా గుర్తింపు పొందింది. దాడి అనంతరం టెహ్రాన్(Tehran), మషద్ (Mashhad) నగరాలకు వెళ్లే రైలు సేవలు నిలిచిపోయాయి. చిక్కుకుపోయిన ప్రయాణికులను రహదారి మార్గంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇరాన్ అధికారులు చర్యలు చేపట్టారు.
2025 చివరి నుంచి ఈ చైనా రైల్వే కారిడార్‌ను రష్యా (Russia) కూడా సరుకుల రవాణా (Cargo Transportation) కోసం వినియోగిస్తోంది. దీంతో ఈ మార్గంపై అమెరికా దాడి అంతర్జాతీయ వాణిజ్యంతో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచే లక్ష్యంతో అదనపు దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను పూర్తిగా దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ఉద్దేశమని పేర్కొంది.
బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఉన్న ఒప్పందం ముగిసిపోయిందని, ఇక చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వం తమను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, వారితో చర్చలు కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.








